- అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా
- 106 సెంటర్లు ఏర్పాటు
- పరీక్ష రాయనున్న 90,958 మంది విద్యార్థులు
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 సెంటర్లను ఏర్పాట్లు చేశారు. ఈనెల 4న రెండు సెషన్స్, 5న ఉదయం సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 90,958 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు ఎప్ సెట్ కన్వీనర్ డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి
తెలిపారు.
నిమిషం నిబంధన అమల్లోకి..
పరీక్షల నిర్వహణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష రాసేవారిని 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సెషన్ వారిని 1:30 గంటల నుంచే హాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష ముగిసేవరకు అభ్యర్థులను బయటకు పంపబోమని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ మొదలైనవి), బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని, అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
స్క్రీన్‌పైనే మార్కులు..
పరీక్ష పూర్తికాగానే విద్యార్థులు తమ మార్కులు తెలుసుకునే అవకాశాన్ని ఈసారి నుంచి అధికారులు కల్పించారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. అయితే, తుది ర్యాంకులను మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించి కేటాయిస్తారు. కంప్యూటర్ సిస్టమ్స్ లో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
