సేంద్రియ వ్యవసాయానికి బూస్ట్..ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాల కోసం టీజీ ఆర్గానిక్స్ యాప్

సేంద్రియ వ్యవసాయానికి బూస్ట్..ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాల కోసం టీజీ ఆర్గానిక్స్ యాప్
  • ఈనెల 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
  • సేంద్రియ​ సాగు, మార్కెటింగ్​కు సర్కారు దన్ను
  • రాష్ట్రంలో సుమారు 10 వేల మంది రైతులకు ఆర్గానిక్​ గుర్తింపు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలకు ప్రత్యేకంగా రూపొందించిన “టీజీ ఆర్గానిక్స్” మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈనెల 4న  వికారాబాద్  జిల్లా తాండూరులో నిర్వహించనున్న కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయంలో టీజీ ఆర్గానిక్స్ యాప్‌‌‌‌‌‌‌‌పై సమీక్ష నిర్వహించిన మంత్రి.. సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నేరుగా మార్కెట్ కల్పించడమే ఈ యాప్  ముఖ్య లక్ష్యమని తెలిపారు.

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులపై నమ్మకం పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయంలో రసాయనాల అధిక వినియోగంతో ఖర్చులు పెరగడంతో పాటు పర్యావరణానికి, ఆహార నాణ్యతకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు, వినియోగదారులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారుని, రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 60 వేల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సాగు విస్తరించిందని, హైదరాబాద్  పరిసర ప్రాంతాల్లో ఆర్గానిక్  ఉత్పత్తులకు అధిక డిమాండ్  ఉందని వెల్లడించారు.

ఆర్గానిక్​ సర్టిఫికేషన్​తో వినియోగదారుల నమ్మకం

సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతపై నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అపెడా మార్గదర్శకాల ప్రకారం ఎన్‌‌‌‌‌‌‌‌పీఓపీ, పీజీఎస్  ప్రమాణాలతో ధ్రువీకరణ జరుగుతోంది. రాష్ట్రంలో సుమారు 10 వేల మంది రైతులు 50 వేల ఎకరాల్లో సేంద్రీయ ధ్రువీకరణ పొందారు. మార్కెట్ లో నకిలీ ఆర్గానిక్  ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ధ్రువీకరించిన రైతుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉండే ఈ యాప్.. వినియోగదారులకు విశ్వసనీయ వేదికగా నిలవనుంది. దీనివల్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పారదర్శకత పెరగడంతో పాటు మధ్యవర్తుల ప్రభావం తగ్గి రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది.

టీజీ ఆర్గానిక్స్ యాప్ ప్రత్యేకతలు ఇవే

ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ గుర్తింపు పొందిన రైతుల వివరాలు మాత్రమే నమోదవుతాయి. ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు పండించిన 100కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు సమీపంలోని 50 కిలోమీటర్ల పరిధిలో రైతుల వివరాలను సులభంగా తెలుసుకునే వీలుంటుంది. మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్  వివరాలతో రైతులతో నేరుగా సంప్రదించి ధర నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ప్లే స్టోర్  ద్వారా యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్  చేసుకుని ఓటీపీతో లాగిన్ అయి, అవసరమైన ఉత్పత్తులను ఎంపిక చేసి రైతులను నేరుగా సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో “టీజీ ఆర్గానిక్స్” యాప్ కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.