తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్.. ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్.. ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’లో సీఎం రేవంత్ రెడ్డి
  • ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’లో సీఎం రేవంత్ రెడ్డి
  • భార‌‌త‌‌దేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌‌హౌస్‌‌గా నిర్మించాలి
  • ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవ‌‌స‌‌రం
  • ఏఐ ఒక టెక్నాలజీ కాదు.. మానవ పరిణామ క్రమంలో శక్తివంతమైన మలుపు
  • ఏఐ పరిశోధనల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం- ‘నేషనల్ ఏఐ వార్ రూమ్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం.. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఏఐ పరిశోధనల కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో శుక్రవారం సీఎం పాల్గొని ప్రసంగించారు. భారతదేశాన్ని  ప్రపంచ ఏఐ పవర్​హౌస్​గా నిర్మించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

ఏఐ రోడ్​మ్యాప్ అవసరం..
దేశానికి తక్షణమే నేషనల్​ఏఐ రోడ్‌‌మ్యాప్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధి  ప్రతి దశలో సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌లు, అప్లికేషన్ల లో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలన్నారు.

ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని కేంద్రానికి సీఎం సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధి అవకాశాలకు గండిపడ్తున్నదనే ఆందోళనలను ప్రస్తావిస్తూ.. కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు జరగవచ్చన్నారు. కానీ, సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని సీఎం రేవంత్​ పిలుపునిచ్చారు. అలాగే, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు మద్దతు కల్పించేందుకు వీలుగా నేషనల్​ ఏఐ ఫండ్​ ఏర్పాటుచేయాని ప్రతిపాదించారు.

ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ‘ఇండియా ఏఐ కౌన్సిల్’ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ.. అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలన్నారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని సమిట్ వేదికగా ప్రధాని మోదీతో పాటు ప్రపంచ దేశాలకు సీఎం స్పష్టం చేశారు.

ఏఐ ఒక శక్తిమంతమైన మలుపు.. 
‘‘మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని ఎలా మార్చాయో మనందరికీ తెలుసు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతే. మానవ పరిణామ క్రమంలో ఇది అత్యంత శక్తివంతమైన మలుపు’ అని రేవంత్​ అభివర్ణించారు. 

మునుపటి యంత్రాల మాదిరి కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని గుర్తుచేశారు. రోబోటిక్స్‌‌తో కలిసినప్పుడు యంత్రాలు మేధస్సుతో పాటు పనిచేసే సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయన్నారు.

ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం వివరించారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తుపెట్టుకొని ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని రేవంత్​ హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు.