హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ సొసైటీ గురుకులాల్లో వచ్చే ఏడాది సీట్ల భర్తీకి ఇచ్చిన టీజీ సెట్–2026 గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. బుధవారంతో ముగుస్తున్న గడువును పొడిగించాలని తల్లిదండ్రులు, స్టూడెంట్ల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు లక్షన్నర అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సవరణలు చేసుకునేందుకు బుధవారం నుంచి ఈ నెల 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచామన్నారు.
ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు సీట్లను ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల ఎంట్రెన్స్ కు అప్లై చేసుకోవాలని కోరుతూ టీచర్లు రాష్ట్రంలోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అప్లైకి గడువు ముగుస్తుండగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సెక్రటరీ ఆదేశించారు.
