- లా స్టూడెంట్లకు టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచన
హైదరాబాద్, వెలుగు: లా విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా నిజజీవిత సమస్యలపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సూచించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. టీజీసీహెచ్‌ఈలో 21 రోజుల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు గురువారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వృత్తిపరమైన అనుభవాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో మంచి ప్లేస్‌మెంట్‌లు సాధించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ప్రొఫెసర్ రాజేశ్వర్ మిట్టపల్లి, ఆర్. రాధాకృష్ణన్, ఆంధ్ర మహిళా సభ ప్రతినిధి అమృత అశోక్, ఇస్లామియా లా కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆజమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
