V6 News

సమర్థ భూ పరిపాలనే లక్ష్యంగా రెవెన్యూ జేఏసీ స్టడీ

సమర్థ భూ పరిపాలనే లక్ష్యంగా రెవెన్యూ జేఏసీ స్టడీ
  • బెంగళూరులో రెవెన్యూ క్లబ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌‌ పరిశీలన 
  • తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని టీజీఈజేఏసీ నేతల ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం బెంగళూరులో కర్నాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్), రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రెవెన్యూ క్లబ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్' ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి టీజీఈజేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి, కో-చైర్మన్ కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక హాజరయ్యారు. ప్రభుత్వ సేవల్లో అధికారులు సమగ్రత, వృత్తి నైపుణ్యం, బాధ్యతాయుతమైన పరిపాలనా దృక్పథాన్ని కలిగి ఉండడానికి ఈ రీసెర్చ్ సెంటర్ ఏ విధంగా దోహదపడుతుందనే అంశాన్ని వారు పరిశీలించారు.

రీసెర్చ్ అండ్  ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరంతర అభ్యాసం, పరిశోధనాత్మక ఆలోచన,  ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించారు. దీనికి కర్నాటక ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల ఆర్థిక ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వానికి ఈ కార్యక్రమంపై ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తున్నట్టు తమ అధ్యయనంలో తెలుసుకున్నారు.

తెలంగాణ  వేగంగా అభివృద్ధి చెందుతున్నందునా..ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పాత్ర మరింత కీలకంగా మారుతోందని.లచ్చిరెడ్డి అన్నారు. పాలనలో పారదర్శకత, వేగం, ప్రజలతో అనుబంధం పెరగాలంటే అధికారుల నైపుణ్యం, విజన్,  సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.