- కమిషన్లకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచన
- యూపీఎస్సీ 'శతాబ్ధి సమ్మేళనం'లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: పోటీ పరీక్షల్లో సెలక్ట్ కాని అభ్యర్థుల టాలెంట్ వృథా కావొద్దని, యూపీఎస్సీ, ఇతర స్టేట్ పీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయిన వారి వివరాలతో నేషనల్ లెవల్‌లో ఒక డేటాబేస్ రెడీ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.
ఈ డేటాను ప్రైవేట్ సెక్టార్, ఇతర ప్రభుత్వ సంస్థలతో పంచుకుంటే ఆ అభ్యర్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు.బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది సమ్మేళనం జరిగింది. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.
కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్, యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, టీజీపీఎస్సీ మెంబర్ చంద్రకాంత్ రెడ్డి సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ‘తెలంగాణ పర్స్‌పెక్టివ్’ అనే అంశంపై బుర్రా వెంకటేశం 25 నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశంలోనే తెలంగాణ పీఎస్సీ అతి యంగెస్ట్ అని, అయినా రిక్రూట్‌మెంట్ ప్రక్రియల్లో బెస్ట్ పద్ధతులు పాటిస్తూ తక్కువ టైంలో అద్భుత మైలురాళ్లు సాధిస్తున్నదని వివరించారు. విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్‌లతో సమన్వయం చేసుకుంటూ, ఐటీ సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకంగా పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల పీఎస్సీల మధ్య సమన్వయం కోసం యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కామన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా వనరులు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రిక్రూట్ అయిన ఆఫీసర్లు ఉద్యోగంలో చేరిన తర్వాత వారి పనితీరును ఎప్పటికప్పుడు మానిటర్ చేసే విధానం ఏర్పాటు చేయాలన్నారు.
పీఎస్సీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని, నిధులు, హోదా విషయాల్లో ఉన్న తేడాలను సరిచేయాలని చెప్పారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల సెలక్షన్ బాడీలు అనుసరిస్తున్న బెస్ట్ విధానాలను స్టడీ చేసి ఇక్కడ అమలు చేయాలని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వచ్చే జాతీయ సమావేశానికి టీజీపీఎస్సీ ఆతిథ్యమిస్తుందని ఆయన గుర్తుచేశారు.
