హైదరాబాద్, వెలుగు: సదరన్ డిస్కం పరిధిలోని వినియోగదారులకు మరింత దగ్గరగా ఉండేందుకు టీజీఎస్పీడీసీఎల్ “కరెంటోళ్ల ప్రజా బాట” పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.కార్యక్రమంలో భాగంగా సీఎండీ నుంచి ఆర్టిజన్ స్థాయి వరకు దాదాపు 9,500 మంది సిబ్బంది ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8.00 గంటల నుంచి 10.30 గంటల వరకు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్‌మెన్ తదితరులు పాల్గొని నెట్‌వర్క్ తనిఖీలు చేస్తారు.
ఎల్‌టీ / 11 కేవీ / 33 కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లు వంటి విద్యుత్ పరికరాలను పరిశీలించి, లోపాలను తక్షణమే పరిష్కరించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి నేరుగా సలహాలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ చెప్పారు.
ప్రజా బాట ద్వారా విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడటంతో పాటు నెట్‌వర్క్ బలోపేతం అవుతుందని, ఫిర్యాదులు తగ్గి విద్యుత్ నష్టాలు కూడా తగ్గుతాయని సీఎండీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని సదరన్ డిస్కం పరిధిలో అమలు చేస్తామని పేర్కొన్నారు.
