బస్సుల్లో జీవితకాలం ఫ్రీ జర్నీ..కరీంనగర్ బస్టాండ్​లో పుట్టిన పాపకు ఆర్టీసీ గిఫ్ట్​

బస్సుల్లో జీవితకాలం ఫ్రీ జర్నీ..కరీంనగర్ బస్టాండ్​లో పుట్టిన పాపకు ఆర్టీసీ గిఫ్ట్​

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్​ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్​లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని యాజమాన్యం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్​ను  మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. 

పురుడు పోసిన సిబ్బందికి సన్మానం

కరీంనగర్ బస్ స్టేషన్​లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసిన తమ సిబ్బందిని ఎండీ సజ్జనార్ సన్మానించారు. ఈ నెల 16న కుమారి అనే గర్భిణి, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్టాండ్​లో వెయిట్ చేస్తుండగా ఆమెకు నొప్పులు వచ్చాయి. గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు తీవ్రం కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకొచ్చారు. చీరలను అడ్డుపెట్టి పురుడు పోశారు. అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను సజ్జనార్ కొనియాడారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు, వాళ్లకు ఆపదొస్తే తామున్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు.