థాయిలాండ్‌లో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చైనా మద్దతుతో జరుగుతున్న ఒక భారీ రైల్వే ప్రాజెక్టు వద్ద క్రేన్ కుప్పకూలడంతో.. అటుగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కనీసం 22 మంది మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
బ్యాంకాక్ నుండి ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు 195 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు.. నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ జరుగుతున్న హై-స్పీడ్ రైల్వే పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ అకస్మాత్తుగా రైలుపై కుప్పకూలింది. ప్రమాద ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైలు నుండి దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
స్థానిక పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. బోగీల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు ప్రకటించగా.. మృతుల సంఖ్య 22కు చేరుకుందని స్థానిక పోలీసు చీఫ్ కన్ఫమ్ చేశారు. రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన క్రేన్, చైనా సహకారంతో థాయిలాండ్‌లో చేపట్టిన 5.4 బిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగం. చైనా 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్'లో భాగంగా బ్యాంకాక్‌ను చైనాలోని కున్మింగ్‌తో కలిపేలా ఈ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టు వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ క్రేన్ ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. రవాణా మంత్రి పిపట్ రాట్చకిత్‌ప్రకాన్ ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తూ, బాధితులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.
