సొంతింటి కల.. ప్రతి సగటు మనిషి లైఫ్ టైం డ్రీమ్. జీవితాంతం కష్టపడి సంపాదించిన సేవింగ్స్, చేతిలో ఉన్న డబ్బులు, పీఎఫ్ ఫండ్స్.. ఇలా సర్వస్వం ధారపోసి ఓ మెగా ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకుంటే.. చివరకు ఆ బిల్డర్ చేతులెత్తేస్తే? సరిగ్గా ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు ముంబై సమీపంలోని ఠాణే హోమ్ బయ్యర్లు. ఠాణేలో ఏకంగా 72 అంతస్తుల స్కైస్క్రాపర్‌గా మార్కెట్ చేసిన ‘STG స్టార్ లివింగ్’ ప్రాజెక్ట్ ఇప్పుడు వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది.
థీమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మిస్తున్న ఈ మెగా టవర్‌పై నమ్మకంతో 2018 నుంచే బయ్యర్లు పెట్టుబడులు పెట్టారు. ఒకానొక దశలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు ఇందులో పెట్టుబడి పెట్టడంతో జనాల్లో నమ్మకం రెట్టింపయింది. అయితే 2023 ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 72 అంతస్తులు కట్టాల్సిన చోట కేవలం 10 అంతస్తుల స్లాబ్ వర్క్ మాత్రమే పూర్తి చేసి బిల్డర్ చేతులెత్తేయడం షాక్‌కు గురిచేస్తోంది. బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు, కరెంట్ బిల్లు కట్టకపోవడంతో నిర్మాణ స్థలానికి పవర్ కనెక్షన్ కూడా కట్ అయింది.
మహారేరా గడువు ప్రకారం డిసెంబర్ 31, 2026 నాటికి ఇళ్లు అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కస్టమర్ల దగ్గర నుంచి ఏకంగా 45 శాతం డబ్బులు వసూలు చేసి.. కేవలం 10 ఫ్లోర్లు మాత్రమే నిర్మాణం జరగటంతో ప్రాజెక్ట్ నిధులు వేరే చోటికి మళ్లించారని హోమ్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. బిల్డర్ దివాలా తీయడంతో కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి చేరింది. అయితే కోర్టు నియమించిన రెజల్యూషన్ ప్రొఫెషనల్ మోనికా రమేష్ షా.. పనులు మళ్లీ మొదలవ్వాలంటే చదరపు అడుగుకు అదనంగా రూ.5వేలు చెల్లించాలని కండిషన్ పెట్టడంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయామని.. ఈ అదనపు భారాన్ని భరించే ప్రసక్తే లేదని బుధవారం జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారు.
ALSO READ : ఈ తేదీల్లో పుట్టినోళ్లు డబ్బు సంపాదించడంలో కింగ్స్ !
బాధితుల్లో ఒకరైన 58 ఏళ్ల అడ్వకేట్ మహిళ మాట్లాడుతూ.. తమకున్న ప్రాపర్టీని తాకట్టు పెట్టి, నగలు అమ్మి, భర్త పీఎఫ్ డబ్బులను కూడా బిల్డర్‌కు కట్టేశామని చెప్పుకొచ్చారు. 2023లో పొసెషన్ ఇస్తారని నమ్మామని.. ఇప్పుడంతా నట్టేట మునిగామని కన్నీరుమున్నీరయ్యారు. మరో 72 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల 30లక్షలు వడ్డీతో సహా చెల్లించాలని 2019లోనే మహారేరా ఆర్డర్ ఇచ్చినా.. బిల్డర్ డైరెక్టర్లు వినోద్, హరేష్ దౌలతాని ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదు. పాండమిక్ కష్టాలు, స్లమ్ రీడెవలప్‌మెంట్ ఖర్చుల వల్లే ఆలస్యమైందని బిల్డర్ సాకులు చెబుతున్నా.. కష్టార్జితాన్ని నమ్ముకున్న వందలాది మిడిల్ క్లాస్ కుటుంబాల కలల సౌధం మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
