శివసేన మాదే.. గవర్నర్ కు 34 మంది ఎమ్మెల్యేల లేఖ

శివసేన మాదే.. గవర్నర్ కు 34 మంది ఎమ్మెల్యేల లేఖ

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గంట గంటకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేయడంతో సర్కార్ సంక్షోభం పడిపోయింది. దీంతో షిండేపై శివసేన వేటు వేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించింది. 

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంట్లో ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖలో కోరారు. ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే, ఆ ఎమ్మెల్యే స్వచ్ఛందంగా శివసేన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పరిగణిస్తామని లేఖలో పేర్కొన్నారు. సరైన కారణం, ముందస్తు సమాచారం లేకుండా ఎవరైనా సమావేశానికి గైర్హాజరైతే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖలో హెచ్చరించారు. శివసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కావాలని వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు పంపారు. ఒకవేళ ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు సమావేశానికి హాజరుకాని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే..  ఏక్ నాథ్ షిండేనే తమ నేతగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఒక లేఖను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాశారు. ఏక్ నాథ్ షిండేను తమ నేతగా గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి విప్ జారీ చేసే అధికారం లేదంటూ ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. సీఎం ఉద్ధవ్ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యాంగ విరుద్ధమన్నారు. శివసేన చీఫ్ విప్ ను మార్చిన ఏక్ నాథ్ షిండే.. చీఫ్ విప్ గా భారత్ గోగ్ వాలేను నియమించారు. తన తిరుగుబాటు వెనుక బీజేపీ ప్రమేయం ఉందని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇప్పటి వరకు తాము బీజేపీ నేతలతో చర్చలు జరపలేదన్నారు. తామే నిజమైన శివసైనికులమని చెప్పారు. 

అటు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కరోనా బారిన పడ్డారు. ఆయన క్వారెంటైన్ లో ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. షిండే, గవర్నర్ భేటీకి చాన్స్ లేకపోవడంతో అక్కడ పొలిటికల్ సీన్ మళ్లీ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.