ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యారంగంపై సర్కారు నిర్లక్ష్యం

తొర్రూర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఏబీవీపీ లీడర్లు మండిపడ్డారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ వద్ద సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్టూడెంట్లకు నాలుగేండ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఆకాశానికి తాకాయని వాపోయారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. 

పెండింగ్ స్కాలర్ షిప్ లు రిలీజ్ చేయాలి..

జనగామ  అర్బన్ : పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు , ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని టీజీవీపీ జనగామ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్​ఏవో మన్సూర్ అలీకి వినతిపత్రం అందజేశారు. నాలుగేండ్లుగా రూ.2200కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నర్సంపేట, వెలుగు : పైసా లంచం లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలోని తన క్యాంప్ ఆఫీసులో 108 మంది లబ్ధిదారులకు శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులున్నారు.

భూనిర్వాసితులకు అండగా ఉంటాం

రేగొండ, వెలుగు : కాకతీయ థర్మల్​పవర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం గణపురం మండలం దుబ్బపల్లి గ్రామంలో నిర్వహించిన భూసేకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. కేటీపీపీ నుంచి పొంచి ఉన్న కాలుష్యం దృష్ట్యా గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు చెప్పారు. చట్ట ప్రకారం భూసేకరణ చేసి, గ్రామస్తులకు పరిహారం అందిస్తామన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. గ్రామస్తులకు ప్రత్యామ్నాయంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటుకు 34 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి కుటుంబానికి భూమి కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూసేకరణకు రూ.76.66 కోట్లు, కాలనీ ఏర్పాటుకు రూ.32.66కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ములుగు, వెలుగు : కరోనా మళ్లీ విజృస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ములుగు డీఎంహెచ్ వో అప్పయ్య ఆదేశించారు. శనివారం ములు గు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్​తో కలిసి రివ్యూ నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గత అనుభవాల దృష్ట్యా వార్డుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

జనగామ అర్బన్, వెలుగు : క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మాచర్ల బిక్షపతి అన్నారు. యువత క్రీడల్లో రాణించాలని కోరారు. బొమ్మెర పోతన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ముగియగా.. చీఫ్ గెస్టుగా ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం టోర్నమెంట్ లో గెలుపొందిన కంచనపల్లి టీంకు కప్ అందజేశారు.

కొనసాగుతున్న కడియం టోర్నమెంట్..

స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొం డ గ్రామంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోంది. శనివారం పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం స్టేట్ వర్కింగ్​ ప్రెసిడెంట్ తీగల కరుణాకర్​రావు కరుణాపురం, శివునిపల్లి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్​కి టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్లు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.