వామన్ రావు మర్డర్ కు 10 నెలల కిందే ప్లాన్..

వామన్ రావు మర్డర్ కు 10 నెలల కిందే ప్లాన్..

హైకోర్టు లాయర్లు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. వామన్ రావు దంపతుల హత్యకు 10 నెలల ముందే నిందితులు ప్లాన్ చేశారని…. 4 నెలల క్రితమే రెక్కీ చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులు బిట్టు శ్రీను, కుంట శ్రీను ఈ విషయాలను విచారణలో అంగీకరించారని చెప్పారు. వామన్ రావు తమను ఆర్థికంగా దెబ్బతీశారని… అవమానించేలా అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆగ్రహంతోనే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారని తెలిపారు పోలీసులు.

కేసును మరింత వేగంగా విచారణ చేస్తున్నామని… ఫోరెన్సిక్, సైబర్ ఎక్స్ పర్టుల సాయంతో లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్. పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును 4 రోజుల కిందే అదుపులోకి తీసుకున్నారు. లాయర్ల హత్య జరిగిన తర్వాత రోజే కుంట శ్రీను, కుమార్ తో పాటు చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి మంథనిలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా బిట్టు శ్రీను ఉన్నాడు. అవినీతి, అక్రమాలతో వచ్చిన డబ్బుతో ట్రస్ట్ నడుపుతున్నారని వామన్ రావు అనేకసార్లు ఆరోపించారు. వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ట్రస్ట్ ఆదాయంపై కంప్లైంట్లు చేశారు. మంథనిలో చెత్త రవాణా కోసం బిట్టు శ్రీను కాంట్రాక్ట్ పై ట్రాక్టర్ పెట్టాడు. దీనిపై నెలకు 30 వేల రూపాయలు ఇన్ కం వచ్చేది. 2019 మార్చిలో ఈ ట్రాక్టర్ కాంట్రాక్టర్ పై గ్రామ పంచాయతీకి కంప్లైంట్ చేశారు. వామన్ రావు ఒత్తిడితో పంచాయతీ ఆఫీసర్లు కాంట్రాక్టర్ ను రద్దు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వామన్ రావు విజయంగా ప్రచారం జరిగింది. దీంతో వామన్ రావుపై బిట్టు శ్రీను ఆగ్రహం పెంచుకున్నట్టు తెలుస్తుంది.

బిట్టు శ్రీను, కుంట శ్రీనుకు ఆరేళ్ల కిందటి నుంచి స్నేహముంది. తర్వాత చిరంజీవి వీరికి తోడయ్యాడు. ఇదే టైమ్ లో వామన్ రావు ఓ ఫోన్ కాల్ విషయంలో  హైదరాబాద్ లో కుంట శ్రీనుపై కేసుల పెట్టించాడు. దీంతో పాటు గుంజపడుగు గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి, ఇంటి నిర్మాణం విషయంలో వామన్ రావు కంప్లైంట్ చేశాడు. అధికారులు కుంట శ్రీను ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీనిపై కూడా వామన్ రావు పై కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడు. కుంట శ్రీను, బిట్టు శ్రీను ఇద్దరు కలిసి వామన్ రావును ఎలా చంపాలనే దానిపై ప్లాన్ చేసుకున్నారు. రెండు కత్తులు కూడా చేయించి చిరంజీవి ఇంట్లో పెట్టారు. 4 నెలల క్రితం వామన్ రావు 15 మందితో 3 కార్లలో మంథని కోర్టుకు రాగా… చిరంజీవి బిట్టు శ్రీను, కుంట శ్రీను కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే వారు మంథని వచ్చేలోపే వామన్ రావు గుంజపడుగకు వెళ్లాడు. ఊరికి వెళ్లి చంపేందుకు రెక్కీ చేశారు. జనం ఎక్కువగా ఉండడంతో వాయిదా వేసుకున్నారు.

వామన్ రావు ఎప్పుడు ఒంటరిగా దొరకుతాడా అని నిందితులు వేచి చూస్తూ వచ్చారని చెప్పారు పోలీసులు. ఈ నెల 17 న వామన్ రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చారని తెలియడంతో కుంట శ్రీను, బిట్టు శ్రీను అలర్టయ్యారు. కోర్టు దగ్గర ఉన్న కుంట లచ్చయ్యకు ఫోన్ చేసి కన్ఫార్మ్ చేసుకున్నారు. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి కత్తులు తీసుకొని రమ్మన్నారు. బిట్టు శ్రీను మంథని బస్టాప్ దగ్గర చిరంజీవి, కుంట శ్రీను మర్డర్ ప్లాన్ చేసుకున్న చోటికి ఆ కారులో వెళ్లారు. వామన్ రావు, నాగమణిలను హత్య చేశాక…. బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పారు. అతను మహారాష్ట్రకు వెళ్లిపొమ్మని చెప్పడంతో పారిపోయారని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.

వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి మంథని మున్సిపాల్టీలో పోలీసులు విచారణ చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య శైలజ మంథని మున్సిపాల్టీ చైర్ పర్సన్ గా ఉన్నారు. లాయర్ల హత్య కేసులో పోలీసులు మధు మేనల్లుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఈ టైమ్ లో మున్సిపాల్టీలో విచారణ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వామన్ రావు మంథని మున్సిపాల్టీ విషయంలో ఏవైనా కేసులు వేశారని అని ఆరా తీసినట్టు సమాచారం.  గతంలో పుట్ట శైలజ ఎన్నికల అఫిడవిట్ పై వామన్ రావు కేసు వేసినట్టు తెలుస్తుంది.

వామన్ రావు, నాగమణి హత్యతో పాటు రామగుండం సీపీ సత్యనారాయణ చేసిన కామెంట్స్ పై మంథని బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. సోమవారం లాయర్లు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మార్చి 1 వరకు మంథని కోర్టులో డ్యూటీలను బహిష్కరించారు. రాష్ట్రంలోని మిగతా బార్ అసోసియేషన్లు కూడా తమకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. లాయర్లను ఉద్దశించి సీపీ సత్యనారాయణ చేసిన అభ్యంతరకర కామెంట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరాలని తీర్మానించారు. నిందితుల తరపున మంథని బార్ అసోసియేషన్ మెంబర్ ఎవరూ వాదించరాదని…. ఇతర బార్ అసోసియేషన్లు కూడా సహకరించాలని తీర్మానించారు.

మరోవైపు తనకు న్యాయవాదులపై అమిత గౌరవం ఉందన్నారు రామగుండం సీపీ సత్యనారాయణ. ఆ మాటలు న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడినవి కావన్నారు. మంథని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులపై తరచుగా ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని అడిగినప్పుడు వివరణగా మంథనిలో కొంతమంది ఒకరిపై ఒకరు పిటిషన్లు దావాలు వేసుకుంటారని అన్నానన్నారు. చిన్న, చిన్న విషయాలపై కూడా లీగల్ బాటిల్ చేసుకొని పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారనే ఉద్దేశ్యంతో కొంతమంది మధ్య లీగల్ ఫ్యాక్షనిజం , రాజకీయంగా ఎక్స్ ట్రీమ్ పోరాటం నడుస్తుందనడం తప్ప గౌరవ న్యాయవాదులను కానీ,. బార్ అసోసియేషన్ వారిని కానీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు సీపీ. మంథని బార్ అసోసియేషన్ తో పాటు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లాయర్లు వృత్తి ధర్మంలో నిష్పక్షపాతంగా న్యాయ సేవ చేస్తున్నారని చెప్పారు సీపీ. వారిపై తమకు అమితిమైన గౌరవ మర్యాదలు ఉన్నాయన్నారు సీపీ సత్యనారాయణ.