ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్స్ కంపెనీలో పనిచేసేవాడతను. ఖాళీ టైమ్‌లో కొత్త డిజైన్ల తయారీపై ప్రయోగాలు చేసేవాడు. ఒకరోజు అతని శ్రమ ఫలించింది. రంధ్రాలున్న ఎలక్ట్రిక్ సాకెట్(హోల్డర్), ప్లగ్ తయారుచేశాడు. వాటిని యజమానికి చూపించాడు. ఆయన మెచ్చుకోలేదు. పైగా నిరుత్సాహపరిచాడు. స్నేహితులు, బంధువులదీ అదే మాట. అయితే, ఆ వ్యక్తి నమ్మకం కోల్పోలేదు. పైగా ఉద్యోగం మానేశాడు. ఇల్లు, నగలు తాకట్టు పెట్టి, లోన్ తెచ్చి, హోల్డర్లు, ప్లగ్‌ల తయారీ మొదలుపెట్టాడు. కానీ, వాటిని ఏ షాపు వాళ్ళూ కొనలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. చివరికి ఇల్లు వేలానికి వచ్చింది. అప్పుడు జరిగిందో ట్విస్ట్. ఒకేసారి వెయ్యి హోల్డర్లు, ప్లగ్లకు ఆర్డర్ వచ్చింది. అంతే, అతని దశ తిరిగిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక పెద్ద ఎలక్ట్రానిక్ ప్రపంచాన్నే సృష్టించాడు. ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇప్పుడా కంపెనీ కేరాఫ్ అడ్రస్. ఆ కంపెనీ పేరు ‘పానసోనిక్’. ఆ వ్యక్తి కొనొసుకె మత్సుహిత.
రేడియోలు, టేప్రికార్డర్లు, బ్యాటరీలు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, వాటర్ ఫ్యూరిఫయర్లు, మొబైల్ ఫోన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు.. ఇలా ఒకటేమిటి ఇంట్లోకి కావాల్సిన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేసే కంపెనీలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి కంపెనీయే పానసోనిక్. దీని మొదటి పేరు మత్సుహిత ఎలక్ట్రిక్ వేర్‌హౌస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ. పేదరికం, వెక్కిరింతలు, అవమానాల నుంచి పుట్టిన కంపెనీ ఇది. వీటన్నింటినీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు కొనెసుకె మత్సుహిత.
తొమ్మిదేండ్లకే పనిలోకి..
జపాన్‌లోని ‘వసముర’ అనే ఊళ్లో 1894 నవంబర్ 27న పుట్టాడు కొనెసుకె మత్సుహిత. తల్లిదండ్రులు మసకుసు, టొకుయి మత్సుహిత. ఈ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు. అందరికంటే చిన్నోడు కొనెసుకె. తండ్రి వ్యసనపరుడు, జూదం విపరీతంగా ఆడేవాడు. దాంతో ఉన్న కొద్దిపాటి పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తల్లీ, పిల్లలు పనికి వెళ్ళేవాళ్లు. అయినా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. చివరికి తొమ్మిదేండ్ల వయసులో కొనెసుకె కూడా బడికి వెళ్ళడం మానేయాల్సి వచ్చింది. అంతేకాదు, దగ్గరలోని వకయమ సిటీలో ఒక షాపులో పనికి చేరాడు కొనెసుకె. ఆ షాపులో పింగాణీ, వెదురు పాత్రలు తయారుచేసేవాళ్ళు. ఆ షాపులో గొడ్డుచాకిరీ చేశాడు కొనెసుకె. చివరికి యజమాని కొడుకును కూడా చూసుకోవాల్సి వచ్చేది. దాంతో కొన్ని రోజులకు అక్కడ పనిమానేశాడు. ఒసాకాలోని ఒక సైకిల్ షాపులో చేరి, అక్కడ ఐదేండ్లు పనిచేశాడు.
మలుపు తిప్పిన ఎలక్ట్రిక్ షాప్
జపాన్‌లో అదే టైంలో కార్ల సందడి మొదలైంది. ఒసాకా రోడ్ల మీద కనిపించే కార్లను చూసిన కొనెసుకెకి ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరిగే అవకాశముందని అర్థమైంది. వెంటనే అదే సిటీలో ఉన్న ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరాడు. అదే టైంలో ముమొనొతో పెండ్లి అయింది. ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో విద్యుత్ ల్యాంప్‌లు తయారుచేసేవాళ్లు. అక్కడే బల్బులు, సాకెట్స్ తయారుచేయడం నేర్చుకున్నాడు కొనెసుకె. అలాగే ఖాళీ టైంలో కొత్త వస్తువుల తయారీపై ప్రయోగాలు చేసేవాడు. అలా ఎలక్ట్రిక్ సాకెట్(హోల్డర్), ప్లగ్ తయారుచేశాడు. కానీ, యజమానికి అవి నచ్చలేదు. అయితేనేం, తాను తయారుచేసినవాటిపై పూర్తి నమ్మకం ఉన్న కొనెసుకె కొత్త కంపెనీ పెట్టాలనుకున్నాడు. అతని ఆలోచనకు ఇంట్లోవాళ్ళు, స్నేహితులు, బంధువులు ‘నో’ చెప్పారు. కారణం.. కొనెసుకె చదువుకోకపోవడం. అంతేకాదు, ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో అతనిది మంచి హోదా ఉన్న పర్మినెంట్ జాబ్. మంచి జీతం కూడా వచ్చేది. మరోవైపు కొత్త కంపెనీ పెట్టడానికి అవసరమైన డబ్బు, అనుభవం కూడా లేవు. వీటన్నింటినీ గుర్తుచేసి అతని మనసు మార్చడానికి ప్రయత్నించారు. కానీ, కొనెసుకె వెనక్కి తగ్గలేదు. ఉద్యోగం మానేశాడు.
మత్సుహిత మాన్యుఫాక్చరింగ్
ఉద్యోగం చేస్తున్నప్పడు మిగుల్చుకున్న డబ్బుతోపాటు బ్యాంక్ లోన్ తీసుకొని 1918లో మత్సుహిత ఎలక్ట్రిక్ వేర్‌హౌస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ పెట్టాడు కొనెసుకె. అప్పటికి అతనికి 23 ఏండ్లు. కంపెనీలో తోడుగా బావమరిది తొషియొ లుయి, మరో ముగ్గురు అసిస్టెంట్స్ పనిచేసేవాళ్ళు. కంపెనీలో తయారైన వాటిలో ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోలేదు. మొదట్లో ఒసాకాలోని ప్రతీ షాప్ దగ్గరికి వెళ్ళి హోల్డర్లు, ప్లగ్‌లు చూపించేవాడు కొనెసుకె. అయినా, ఎవరూ కొనేవాళ్ళు కాదు. అయితే, అతను నమ్మకం కోల్పోలేదు. కంపెనీలో ఉత్పత్తి ఆపలేదు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇల్లు గడవడం కష్టమైంది. భార్య నగలు, ఇంట్లోని కొన్ని విలువైన వస్తువులు అమ్మేశాడు. మరోవైపు బ్యాంకు లోన్ కట్టకపోవడంతో ఇంటిని వేలం వేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఇక అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో ఒక షాప్ నుంచి ఏకంగా వెయ్యి హోల్డర్లు, ప్లగ్లకు ఆర్డర్ వచ్చింది. అంతే, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు కొనెసుకె. నెమ్మదిగా కంపెనీ డెవలప్ అయింది. సిబ్బంది ఎక్కువయ్యారు. బ్రాంచ్‌లు పెరిగాయి. బల్బులు, రేడియోలు కూడా తయారుచేయడం మొదలుపెట్టింది కంపెనీ.
ఆర్థిక మాంద్యం, యుద్ధం..
1930లో జపాన్‌లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఖర్చులు తట్టుకోలేక కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం మొదలుపెట్టాయి. కొనెసుకె మాత్రం ఆ పని చేయలేదు. ఉద్యోగులు ఆఫీసులో పనిచేసే టైం సగానికి తగ్గించాడు. మిగిలిన టైంలో కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మే బాధ్యత అప్పగించాడు వాళ్ళకు. దాంతో కంపెనీ ఆర్థికమాంద్యాన్ని తట్టుకొని నిలబడింది. అలాగే రెండో ప్రపంచయుద్ధం టైంలో కంపెనీ ఇబ్బందుల్లో పడింది. అప్పుడు కూడా కంపెనీని కాపాడుకున్నాడు కొనెసుకె. అందుకే ఉద్యోగులు కొనెసుకెను ‘గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్’ అని పిలిచేవాళ్ళు. యుద్ధంలో జపాన్ ఓడిపోయాక, జపాన్ మిలిటరీకి సహకరించాడనే ఆరోపణతో కొనెసుకెను అమెరికా సైన్యం అరెస్టు చేసింది. ‘మా యజమాని నిర్దోషి. అతన్ని విడిచిపెట్టండ’ని ‘మత్సుహిత’ ఉద్యోగులంతా మూకుమ్మడిగా అమెరికాకు ఉత్తరాలు రాశారు. దాంతో కొనెసుకెను విడుదల చేయక తప్పిందికాదు వాళ్ళకు. ఆ తర్వాత మరింతగా పనిచేశాడు కొనెసుకె. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ సామాన్లన్నీ తయారుచేసే స్థాయికి కంపెనీని చేర్చాడు. ప్రపంచమంతా బ్రాంచ్‌లు విస్తరించాడు. ఇప్పుడు కంపెనీలో దాదాపు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు. 1973లో రిటైర్ అయిన కొనెసుకె, అనారోగ్యం కారణంగా 94 ఏండ్ల వయసులో 1989 ఆగస్ట్ 27న చనిపోయాడు.
‘పానసోనిక్’ అలా వచ్చింది
మత్సుహిత కంపెనీ 1955లో కొత్త ఆడియో స్పీకర్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వీటికి ‘పానసోనిక్’ అని పేరు పెట్టింది. ఇది ‘పాన్’, ‘సోనిక్’ అనే రెండు పదాలతో కలిపి పెట్టిన పేరు. ఇందులో ‘పాన్’ అంటే ప్రపంచం. సోనిక్ అంటే సౌండ్(శబ్దం). అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు కంపెనీ గురించి తెలిసేలా సౌండ్ చేయడం అని అర్థం. తర్వాత 2008లో ‘మత్సుహిత ఎలక్ట్రిక్ వేర్‌హౌస్ కంపెనీ’ బదులు ‘పానసోనిక్’ అనే పేరు వాడడం మొదలుపెట్టారు. అలా అదే పేరు స్థిరపడింది. కంపెనీ మొదలై వందేండ్లు పూర్తయిన సందర్భంగా 2018లో పానసోనిక్ మ్యూజియం పెట్టారు. ఇది ఒసాకాలోని కదమ ఏరియాలో ఉంది. ఇందులో కొనెసుకె జీవిత్ర చరిత్రకు సంబంధించిన విశేషాలు, కంపెనీ పుట్టుక, ప్రొడక్ట్స్ గురించి వివరంగా ఉంటుంది.
