తెలంగాణ వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయింది

తెలంగాణ వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయింది

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ లో తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం వింత వాదనలు చేస్తున్నది. ఈ ఫ్లడ్ సీజన్ మొదట్లో సాగర్ నుంచి పెద్ద ఎత్తున కరెంట్ ఉత్పత్తి చేసి నీటికి నదిలోకి వదిలేయడంతో పులిచింతల రిజర్వాయర్ గేట్లు పలుమార్లు ఎత్తి దించాల్సి వచ్చిందని, ఎలాంటి సమాచారం లేకుండా తెలంగాణ భారీ ఎత్తున నీటిని దిగువకు వదిలేయడంతో పులిచింతల రిజర్వాయర్ 16వ నంబర్ గేటు కొట్టుకుపోయిందని ఆక్షేపించింది. పులిచింతల కెపాసిటీ 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 40.80 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, అయినా తెలంగాణ కరెంట్ ఉత్పత్తితో విలువైన తాగునీటిని వృథాగా నదిలోకి వదిలేస్తుందని తెలిపింది. ఈమేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురేకు కంప్లైంట్ చేశారు. తెలంగాణ కరెంట్ ఉత్పత్తి ఆపకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేయకుండా కట్టడి చేయాలని కోరారు. ఎండాకాలంలో రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలు ఉంటాయని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృథా చేస్తోందని పేర్కొన్నారు. 

అసమర్థతను కప్పి పుచ్చుకునే యత్నం

ప్రాజెక్టు నిర్వహణలో తన అసమర్థతను ఏపీ సర్కారు ఇలా తెలంగాణపైకి నెట్టేసే ప్రయత్నం చేసింది. పీక్ అవర్స్ లో డిమాండ్ మీట్ కావడానికే కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని మన ఇంజినీర్లు చెప్తున్నారు. ఈ ఫ్లడ్ సీజన్ లో మొదటి నుంచి తెలంగాణ కరెంట్ ఉత్పత్తికి అడ్డుతగులుతున్న ఏపీ, శ్రీశైలంలో మినిమం డ్రా లెవల్ కన్నా కిందికి వెళ్లి కరెంట్ ఉత్పత్తి చేసి నీటిని వృథాగా నాగార్జునసాగర్ లోకి వదిలేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 3 వేలకు పైగా గ్రామాలు, 18 మున్సిపాలిటీలకు తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ను శ్రీశైలంలోకి రివర్స్ పంపు చేసుకోవాల్సి వచ్చింది. తన తప్పుపై నోరు విప్పని ఏపీ, మళ్లీ తెలంగాణను కార్నర్ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.