కృష్ణాపై ఏపీ కొత్త ‘లిఫ్ట్’

కృష్ణాపై ఏపీ కొత్త ‘లిఫ్ట్’
  • 30 వేల క్యూసెక్కులు తరలించుకుపోయేలా ప్లాన్
  • రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్
  • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం

అమరావతి, వెలుగు: కృష్ణా నది నుంచి మరో 30 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా తరలించుకునేందుకు ఏపీ సర్కారు ప్లాన్ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో కొత్త ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా కృష్ణా నది వరదల్లో వీలైనంత నీటిని రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనుంది. తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు చేపడతామని ప్రకటించి, ఇప్పుడు కృష్ణా జలాల అదనపు వినియోగంపై సొంతంగా అడుగులు వేస్తోంది. కృష్ణా నదిపై ప్రస్తుతం ఉన్న మచ్చుమర్రి, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఏపీ దాదాపు 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించు కుంటోంది. ఈ వాటర్ ఇయర్ లోనే ఏపీ తన వాటాకు మించి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటిని తరలించింది. ఈ అంశంపై తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు కృష్ణా బోర్డుకు కంప్లెంట్ చేశారు. నీటి అక్రమ తరలింపుపై సరైన సమాధానం ఇవ్వని ఏపీ మరో కొత్త ప్రాజెక్టు నిర్మించాలని చూస్తోంది. కృష్ణా పై మచ్చుమర్రి వద్ద కొత్తగా 30 వేల క్యూసెక్కుల కెపాసిటీతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనుంది. కొత్తగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా వరద నీటిని శ్రీశైలం కుడి కాల్వకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి హంద్రీనీవా, ఎస్ఎల్బీసీ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు నీటిని తీసుకెళ్తారు. రెండేళ్లలో పూర్తయ్యే ఈ స్కీంతో కృష్ణా నదిలో భారీ వరదలు వచ్చే 40 రోజుల్లో వీలైనంత ఎక్కువ నీటిని తరలించాలనేదే ఏపీ సర్కార్ ప్లాన్. దీంతో పాటు 44 వేల క్యూసెక్కుల తరలించే అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీని మరింత పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనికి సీఎం జగన్ ప్రాథమిక అంగీకారం తెలిపారు. డిసెంబర్ లో జరిగే కేబినేట్ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.

794 అడుగులున్నా నీటిని ఎత్తిపోసేలా…

శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. ఈ ఏడు కృష్ణా నదిలో భారీ వరదల కారణంగా 10 సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదిలారు. దీంతో రెండు నెలల వరద కాలంలో ఏపీ వాటాకు మించి నీటిని తరలించింది. గత ఐదేళ్లలో వరద తక్కువ ఉన్న కారణంగా శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటి మట్టం ఎక్కువ రోజులు లేదు. భవిష్యత్తులో ఈ స్థాయి వరదలు రాకుంటే ఇబ్బంది తప్పదని భావించిన ఏపీ.. ఎత్తిపోతల పథకానికి ప్లాన్ చేసింది. ఈ పథకంతో మచ్చుమర్రి వద్ద 794 అడుగుల నీటిమట్టం ఉన్నా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది.

25 కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు…

రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా అనుసంధానం, కృష్ణా నదిపై 2 కొత్త బ్యారేజీల నిర్మాణం, బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాంటి 25 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలోనే ఈ కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించి, మూడు , నాలుగేళ్లలో పూర్తి చేసేలా అధికారులు ప్రపోజల్స్ రెడీ చేశారు.వీటి కోసం రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 90 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.

The AP government plans to move another 30 thousand cusecs of water from the Krishna River