సింగూర్‌ ప్లాంట్‌ కేసు.. టాటాకు రూ.766 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్‌ ఆదేశం

సింగూర్‌ ప్లాంట్‌ కేసు.. టాటాకు రూ.766 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్‌ ఆదేశం

సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంటు కేసులో ట్రిబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కేసులో ఆర్బిట్రాల్‌ ట్రిబ్యునల్‌లో టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటా మోటార్స్‌కు రూ.766 కోట్లు చెల్లించాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 2016 నుంచి 11శాతం వార్షిక వడ్డీతో కలిపి మొత్తం చెల్లించాలని ఆదేశించింది. 

ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ ఈ తీర్పు ఇచ్చింది. అక్టోబర్‌ 30, 2023న వచ్చిన తీర్పు టాటా మోటార్స్‌కు అనుకూలంగా వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.765.78 కోట్లతోపాటు సెప్టెంబర్‌ 1, 2016 నుంచి 11శాతం వార్షిక వడ్డీతో కలిపి నగదు రికవరీ చేసుకోవచ్చని చెప్పింది. 

టాటా మోటార్స్‌ తీసుకొచ్చిన నానో కారు తయారీ యూనిట్‌ను పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం.. సింగూర్‌లో దాదాపు వెయ్యి ఎకరాల వరకు వ్యవసాయ భూమిని సేకరించింది.

అయితే.. భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పెద్ద పోరాటమే చేశారు. ఆమె ఆధ్వర్యంలో సింగూర్‌, నందిగ్రామ్‌లో పెద్ద ఉద్యమమే జరిగింది. దీంతో టాటా తమ తయారీ యూనిట్‌ను గుజరాత్‌కు షిప్ట్​చేసింది.  మూడున్నర దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన వామపక్షాలను గద్దెదించి 2011లో మమత బెనర్జీ అధికారంలోకి రావడానికి ఈ ఉద్యమం బాగా ఉపయోగపడింది.