కేటీఆర్​ ఆదేశించినా అధికారులు పట్టించుకోవట్లే

కేటీఆర్​ ఆదేశించినా అధికారులు పట్టించుకోవట్లే
  • కేటీఆర్​ ఆదేశించినా అధికారులు పట్టించుకోవట్లే
  • రైతు భూమిని కలిపేసుకుని రియల్టర్ అక్రమ లేఔట్
  • అధికారులు పట్టించుకోవట్లేదంటూ మంత్రికి ట్విట్టర్‌లో ఫిర్యాదు
  • అయినా పరిష్కరించడం లేదంటున్న బాధితుడు భిక్షపతి

షాద్ నగర్, వెలుగు:  తన భూమిపై ఓ రియల్టర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని, దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆరోపించాడు. తన సమస్యపై మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​లో ఫిర్యాదు చేశానని,  కేటీఆర్ అధికారులను ఆదేశించినా వారు స్పందించడం లేదని అతడు మంగళవారం మీడియాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.  రంగారెడ్డి జిల్లాలోని షాద్​నగర్ మున్సిపాలిటి​పరిధి ఫరూఖ్​నగర్​లోని సర్వే నంబర్ 363/ఆ లో  మోడంపల్లి భిక్షపతికి వారసత్వంగా వచ్చిన ఎకరం30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దీని పక్కనే ఉన్న భూమిలో ఓ రియల్టర్ ​వెంచర్ వేసి భారీగా విల్లాలు నిర్మించాడు. రెండేళ్ల కిందట రైతు భిక్షపతి అనుమానించి రిజిస్ట్రేషన్​ఆఫీసులో ఈసీ (ఎన్​కంబరెంట్ సర్టిఫికెట్​) తీయగా తన భూమిని కూడా కలిపి వెంచర్​గా చేసినట్టు తేలింది. అంతేకాకుండా తన భూమి పది శాతం మున్సిపాలిటీ  లే ఔట్​ కిందకు వెళ్లినట్టు తేలడంతో  అక్రమ లే ఔట్​పై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దీంతో గత మే 31న మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై మంత్రి స్పందించి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించగా భూమి వద్దకు వెళ్లి పరిశీలించారని, ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై షాద్​నగర్​ మున్సిపల్ కమిషనర్ లావణ్యను అడిగితే భిక్షపతి భూమికి సంబంధించి అక్రమ లే ఔట్​పై వచ్చిన ఫిర్యాదును హెచ్ఎండీఏ అధికారులకు పంపానని, ఉత్తర్వులు రాగానే ఎంక్వైరీ చేస్తామన్నారు. కొందరు రియల్టర్లు రైతుల భూములపై వారికి తెలియకుండానే పేపర్లు సృష్టించి కబ్జాకు యత్నిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని  సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు విమర్శించారు.