
ఇయ్యాల ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు : త్వరలో జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శని వారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీలు, ఏడు మోర్చాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో కీలక భేటీ జరగనుంది. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ కూడా పాల్గొనే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మీటింగ్లో పాల్గొనేందుకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు పలు దఫాలుగా జరగనున్న ఈ సమావేశంలో... మోదీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంతో పాటు మోర్చాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రోగ్రామ్స్, పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ఎన్నికలు జరగనున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో మోర్చాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై మోర్చా అధ్యక్షులు రిపోర్టులు ఇవ్వనున్నారు. కాగా, కర్నాటకలో ఓటమి నేపథ్యంలో దక్షిణాదిలో అధికారాన్ని నిలుపుకోవాలంటే తెలంగాణలో తప్పకుండా గెలవాలని బీజేపీ హైకమాండ్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు హైకమాండ్ ప్రణాళిక రూపొందిస్తున్నదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
వారం పాటు సమావేశాలే..
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా బీజేపీ భావిస్తున్నది. ఈ రెండు ఎన్నికలపై కస రత్తు ప్రారంభించింది. తెలంగాణలో బీఆర్ఎస్, మిజో రంలో ఎంఎన్ఎఫ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి తెలంగాణ, రాజస్థాన్లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తున్నది. ఈ 2 రాష్ట్రాల్లో గెలవాలని, మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావాలని.. మిగిలిన రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నది. 2024 లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మూడోసారి అధికారం చేపట్టాలని యోచిస్తున్నది.
ఇందులో భాగంగా దేశాన్ని 3 భాగాలుగా విభజించి, సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. నార్త్ ఈస్ట్, నార్త్, సౌత్ భాగాలుగా విభజించి.. ఆయా ప్రాంతాల వారీగా మీటింగ్స్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మోర్చాల నేతలు, ముఖ్య లీడర్లతో హైకమాండ్ భేటీ కానుంది.