
- నియోజకవర్గానికి 10 వేల మందిని తరలించాలని టార్గెట్
- కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించిన హైకమాండ్
- నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లు పెడుతున్న నేతలు
నల్గొండ, వెలుగు : జులై 3న సికింద్రాబాద్‌లో జరిగే ప్రధాని మోడీ సభను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా బీజేపీ లీడర్లు కుస్తీలు పడుతున్నారు. మే 14న హైదరాబాద్‌లో జరిగిన అమిత్‌షా మీటింగ్‌కు ఉమ్మడి జిల్లా నుంచి 10 వేల మందికి మించి హాజరుకాలేదని పార్టీ గుర్తించింది. దీనికంటే ముందు హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ చేయాలని అనుకున్నప్పుడు కూడా జిల్లా నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ హైకమాండ్ మోడీ సభకు చెప్పినట్లుగా జన సమీకరణ చేయాల్సిందేని స్పష్టం చేసింది. దీనికి తోడు సభ తర్వాత రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని లీడర్లు చెబుతుండడంతో మోడీ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో జనాలను తరలించేందుకు పది రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్యులతో నల్గొండలో ఇప్పటికే మీటింగ్ నిర్వహించారు. జనసమీకరణ కోసం ప్రతి నియోజకవర్గానికి కోఆర్డినేటర్లను నియమించారు. దీంతో కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో మీటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే ఈ మీటింగ్‌లు పార్టీ నిర్దేశించిన ప్రకారం కాకుండా మొక్కుబడిగా సాగుతున్నాయన్న సమాచారం హైకమాండ్‌కు చేరినట్లు తెలుస్తోంది.
భారమంతా కోఆర్డినేటర్లపైనే...
జనాన్ని తరలించే భారాన్ని పార్టీ నాయకత్వం కోఆర్డినేటర్లపైనే వేసింది. మోడీ సభ గురించి గ్రామాలు, మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేయాలి. పోలింగ్ బూత్ కమిటీలు వేయడంతో పాటు బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జులు, మండల, మోర్చా కమిటీల ఆధ్వర్యంలో మండలాల వారీగా మీటింగ్‌లు నిర్వహించాలి. బహిరంగ సభ నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం నిధులను సైతం సేకరించుకోవాలి. ఒక్కో పోలింగ్ బూత్ తరఫున రూ. 1000, మండల పదాధికారులు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు, జిల్లా పధాదికారులు రూ. 20 వేల వరకు సేకరించాలి. ఈ నిధిని ఎప్పటికప్పుడు పార్టీ ఆన్‌లైన్ అకౌంట్లో జమ చేయాలి.
మొక్కుబడిగా మీటింగ్‌లు
ఉమ్మడి జిల్లాలో మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, ఆలేరు నియోజకవర్గాల్లో మాత్రమే మీటింగ్‌లు ప్రారంభం అయ్యాయి. మునుగోడు, సూర్యాపేటలో మాత్రమే పార్టీ నిర్దేశించినట్లు మీటింగ్‌లు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల మొక్కుబడిగా మీటింగ్‌లు పెడుతున్నట్లు పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. బుధవారం హాలియాలో జరిగిన గొడవ గురించి కూడా పార్టీకి రిపోర్ట్ వెళ్లినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎవరన్న విషయంలో డాక్టర్ రవినాయక్, కంకణాల నివేదితారెడ్డి మధ్య జరిగిన గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇలాంటి సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా కోఆర్డినేటర్లు జాగ్రత్త పడుతున్నారు. జన సమీకరణలో ఇబ్బంది తలెత్తకుండా పార్టీ బలం కలిగిన నియోజకవర్గాలపైన కో ఆర్డినేటర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ప్రభావితం చూపిన నియోజకవర్గాల నుంచే ఎక్కువ మంది జనాన్ని సమీకరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట నియోజవర్గాల నుంచి ఎక్కువ పబ్లిక్‌ను సమీకరించాలని ప్లాన్ చేశారు. మిగిలిన చోట్ల ఆరు వేలకు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. జనం వచ్చేదాన్ని బట్టి మోడీ సభ తర్వాత జిల్లాలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
మోడీ సభకు భారీగా తరలిరావాలి
నల్గొండ/మేళ్లచెరువు/నేరేడుచర్ల, వెలుగు : ప్రధాని మోడీ సభను సక్సెస్ చేయాలని కోరుతూ గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూరులో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, నేరేడుచర్లలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ప్రధాని సభకు ప్రతి బూత్ నుంచి 30 మందిని తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.