ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

హైదరాబాద్/గద్వాల, వెలుగు: టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు, దాష్టీకాలకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో వేలాది మందితో నల్లజెండాలతో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్​చార్జ్​లు, రాష్ట్ర నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని, దీనికి వ్యతిరేకంగా బుధవారం నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. నిరసనల్లో ప్రతి బీజేపీ కార్యకర్త పాల్గొనాలని సూచించారు. తాను పాదయాత్రలో ఉన్నందున గద్వాల నియోజకవర్గం సద్దనోనిపల్లెలో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద బుధవారం ఉదయం 9 నుంచి 9.30 వరకు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష చేస్తానని 
ప్రకటించారు. 

నేడు గవర్నర్​కు వినతిపత్రం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య సహా రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి పార్టీ రాష్ట్ర నేతలు వినతిపత్రం ఇస్తారని సంజయ్ చెప్పారు. ఖమ్మం టౌన్ లో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక సాయిగణేష్ సూసైడ్ చేసుకున్నాడని, కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ వేధింపులకు రామకృష్ణ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ సహా ఆ పార్టీ నేతల బెదిరింపులతో గంగం సంతోష్, అతని తల్లి ఆత్మాహుతికి పాల్పడ్డారని సంజయ్ గుర్తుచేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు స్నేహితులతో కలిసి ఓ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనను సంజయ్ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అధికార పార్టీ ఆగడాలను ఖండించాలని సంజయ్ కోరారు.