చెన్నై: తొలి రోజు ఆల్‌రౌండర్లు సత్తా చాటితే.. రెండో రోజు బౌలర్లు విజృంభించారు. దాంతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఇండియా పట్టు బిగించింది. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా (4/50), మహ్మద్ సిరాజ్ (2/30), ఆకాశ్‌దీప్ (2/19)కు తోడు స్పిన్నర్ రవీంద్ర జడేజా (2/19) కూడా రాణించడంతో.. శుక్రవారం రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 149 రన్స్‌కే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్‌సేనకు 227 రన్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 81/3 స్కోరు చేసింది.
శుభ్‌మన్ గిల్ (33 బ్యాటింగ్), రిషబ్ పంత్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (17) విఫలమయ్యారు. అంతకుముందు 339/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో 376 రన్స్‌కు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ జడేజా (86) మూడో ఓవర్లోనే వెనుదిరగడంతో ఏడో వికెట్‌కు 199 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అశ్విన్ (133 బాల్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113), ఆకాశ్‌దీప్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ మూడు వికెట్లు తస్కిన్ అహ్మద్(3/55) ఖాతాలోకి వెళ్లాయి.
చివర్లో బుమ్రా (7)ను ఔట్ చేసిన హసన్ మహ్మూద్ (5/83) ఐదో వికెట్‌ను సాధించాడు. రెండో రోజు 11.2 ఓవర్లు మాత్రమే ఆడిన ఇండియా 37 రన్స్ జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని ప్రస్తుతం ఇండియా 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.
వణికించిన బుమ్రా
తొలి సెషన్ రెండో గంటలో ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ను బుమ్రా వణికించాడు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే షాద్మాన్(2)ను పెవిలియన్‌కు పంపాడు. కొద్దిసేపటికే ఆకాశ్‌దీప్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 9వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో జాకిర్ హసన్ (3), మోమినల్ హక్ (0)ను ఔట్ చేశాడు. 12వ ఓవర్‌లో నజ్ముల్ శాంటో (20)ను సిరాజ్ దెబ్బకొట్టాడు. 13వ ఓవర్‌లో బుమ్రా.. ముష్ఫికర్ (8)ను ఔట్ చేయడంతో బంగ్లా 40/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో షకీబ్, లిటన్ (22) వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది.
రెండో సెషన్‌లో పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలించడంతో రంగంలోకి దిగిన జడేజా తన వరుస ఓవర్లలో లిటన్, షకీబ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. అప్పటికే 92/7 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టిన బంగ్లా ఇన్నింగ్స్‌ను మెహిదీ హసన్ (27 నాటౌట్) కాపాడే ప్రయత్నం చేసి ఫెయిలయ్యాడు. మరోసారి చెలరేగిన బుమ్రా వరుస విరామాల్లో హసన్ మహ్మూద్ (9), తస్కిన్ అహ్మద్ (11) వికెట్లు పడగొట్టాడు. చివర్లో నహీద్ రాణాను (11) సిరాజ్ పెవిలియన్‌కు పంపడంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
బుమ్రా @400
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి బుమ్రా 400 వికెట్లు పడగొట్టాడు. ఇండియా తరఫున ఈఘనత సాధించిన ఆరో పేసర్‌గా, ఓవరాల్‌గా పదో బౌలర్‌గా నిలిచాడు.
కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకోలే..
తొలి ఇన్నింగ్స్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో తప్పిదం చేశాడు. మెహిదీ హసన్ వేసిన బాల్ విరాట్ ప్యాడ్లకు తాకడంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్ అడగలేదు. గిల్‌తో మాట్లాడినా కూడా రివ్యూ కోరకుండా నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కానీ టీవీ రీప్లేలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న తర్వాతే బాల్ ప్యాడ్లను తాకినట్లు తేలడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 91.2 ఓవర్లలో 376 (అశ్విన్ 113, జడేజా 86, హసన్ మహ్మూద్ 5/83, తస్కిన్ 3/55).
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 47.1 ఓవర్లలో 149 (షకీబ్ 32, మెహిదీ హసన్ 27నాటౌట్, బుమ్రా 4/50).
ఇండియా రెండో ఇన్నింగ్స్: 23 ఓవర్లలో 81/3 (గిల్ 33 బ్యాటింగ్, కోహ్లీ 17).