లోకల్​ వ్యాపారుల దోపిడీతో బయటకు పోతున్న అన్నదాతలు

లోకల్​ వ్యాపారుల దోపిడీతో బయటకు పోతున్న అన్నదాతలు
  • గత ఏడాది మహారాష్ట్రకు తరలించిన రైతులు
  • వ్యయ ప్రయాసాలతో కష్టాలు
  • ఈసారి అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగవుతున్న ఆదిలాబాద్ జిల్లాలో ఏటా కొనుగోళ్లు తగ్గుతున్నాయి. స్థానికంగా రేటు తక్కువగా ఉండడంతో రైతులు వ్యయప్రయాసాలకోర్చి మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు జిల్లాలో పత్తి పంట చేతికొచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఈనెల 14వ తేదీ నుంచి పత్తి 
కొనుగోళ్లు ప్రారంభించాలని ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో లాగా ఒకేసారి కొనుగోళ్లు  ప్రారంభించి ఇబ్బందులు పడేదానికన్నా.. ముందుగా ప్రారంభించి.. కొనుగోళ్లు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.52 లక్షల క్వింటాళ్ల పత్తి పంట సాగైంది. 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,380 గా నిర్ణయించింది. గత ఏడాది ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడంతో సీసీఐ ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయలేదు. 

మహారాష్ట్రకు తెల్ల బంగారం..

అసలే దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మార్కెట్లో వ్యాపారుల మాయజాలంతో మద్దతు ధర దక్కడం లేదు. ఏటా ఎదో ఒక సాకుతో రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారు. తేమ, ధరల కొర్రీలతో రైతులు నష్టపోతున్నారు. గతంలో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వర్షాలు.. వరదల కారణంగా ఈసారి పంట చాలా దెబ్బతిన్నది. ఫలితంగా ఇప్పుడు ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రైతులు మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. లోకల్​వ్యాపారుల మాయజాలంతో ఏటా ధర విషయంలో మోసపోతున్నారు. గత ఏడాది మహారాష్ట్రలో ధర ఎక్కువగా ఉండటంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని రైతులు దిగుబడిని అక్కడికి తరలించారు. అంతర్జాతీయంగా పత్తి బేళ్ల ధర పడిపోయిందందని వ్యాపారులు ప్రచారం చేస్తుండడంతో రైతులు మళ్లీ మహారాష్ట్ర వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేగాకుండా కొంత మంది మహారాష్ట్ర, గుజరాత్ వ్యాపారులు ఇక్కడి గ్రామాల్లో తిరిగి పత్తి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నారు. 

కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం..

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 14 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్​నిర్ణయించారు. ఈ ఏడాది దిగుబడి 21 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేశాం. మద్దతు ధర రూ. 6,380గా నిర్ణయించాం.

-  శ్రీనివాస్, ఏడీ మార్కెటింగ్

మన పత్తికి డిమాండ్..

అంతర్జాతీయంగా ఆదిలాబాద్ పత్తికి డిమాండ్ ఎక్కువే. అంతర్జాతీయంగా బేళ్ల ధరలు పెరిగితే ఇక్కడి రైతులకు మద్దతు ధర పెరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో బేళ్ల ధర పెరిగినప్పటికీ ఇక్కడి వ్యాపారులు మాత్రం ధర పెంచక రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పత్తి కొనుగోళ్ల ప్రారంభంలో పత్తి బేల్ ధర దాదాపు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు ఉండగా, గతేడాది చివర్లో ఒక్క బేల్ ధర రూ.  లక్ష దాటినట్లు తెలిసింది. ఈలెక్కన రైతుకు క్వింటాల్​పత్తికి రూ. 12 వేల వరకు మద్దతు ధర అందాలి. కానీ.. క్వింటాల్​పత్తి రూ. 10 వేలకు మాత్రమే కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. గతేడాది స్టార్టింగ్ ధర రూ.7,900 నుంచి పలుకగా ఈ ఏడాఈది రూ. 10 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.