- కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు వృథా చేసింది
- మంచిర్యాల జిల్లా డీఎంఎఫ్టీ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు తరలించింది
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధుల తరలింపు నిలిచిపోయింది
- ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తోంది
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపు
కోల్‌బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకాల్లో భారీ స్కామ్ జరిగిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు ఇతర భారీ కట్టడాలు చేపట్టిందని పేర్కొన్నారు. కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు వృథా చేసిందన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో శుక్రవారం జరిగిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల జిల్లాకు చెందిన డీఎంఎఫ్టీ నిధులను బీఆర్ఎస్ పాలకులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు అక్రమంగా తరలించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధుల తరలింపు నిలిచిపోయిందని, ఇక్కడి నిధులు ఇక్కడే ఖర్చు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కొత్తగా 2లక్షల పెన్షన్లు శాంక్షన్ చేయనున్నట్టు చెప్పారు. రాజీవ్ యువవికాసంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్ గౌడ్ శ్రమిస్తున్నారని, ఆయన జిల్లాల పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
నింపుతున్నదన్నారు.
- పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులకు ఘన స్వాగతం
డీసీసీ సమావేశానికి వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు మంచిర్యాలలో హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఘన స్వాగతం పలికారు. సమావేశవేదిక వద్ద గాంధీజీ, అంబేద్కర్ ఫొటోలకు అతిథులు పూలమాల వేసి నివాళి అర్పించారు.
- ఇబ్బందులున్నా గ్యారంటీల అమలు: మంత్రి జూపల్లి
ఎన్ని ఆర్థిక ఇబ్బందులెదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నదని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కార్ వడ్డీలు కడుతున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రాహుల్, సోనియాలది త్యాగాల ఫ్యామిలీ అని.. ఇందిర, రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉండాలని, అప్పుడే కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
