కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ బృందం 

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ బృందం 

ఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ బృందం కలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా తీర్మానం చేసిన కాపీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వారు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ తీర్మానం కాపీని, కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేశామని  బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ధర్మేంద్ర శర్మ తమకు చెప్పారని వివరించారు.  

‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951’లోని సెక్షన్ 29- ఏ ప్రకారం ఒక రాజకీయ పార్టీ పేరు మార్చుకోవచ్చని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ పేరు, చిరునామా మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అబ్రివేషన్ పేరుతో ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు కానీ, పార్టీ పూర్తి పేరు ముఖ్యం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వరకు పార్టీ పేరు మారితే బీఆర్ఎస్ మీదనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సర్వ సభ్యసమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ జాతీయ పార్టీగా మార్చే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. తీర్మాన పత్రంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్ చదివి సభ్యుల ఆమోదం పొందారు. పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల సంఘానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను ఇవాళ ఉదయం ఢిల్లీలో ఎన్నిక సంఘానికి వినోద్ కుమార్, ఎం.శ్రీనివాస్ అందజేశారు.