న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితులు, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య దేశీయ ప్రైమరీ మార్కెట్ సందడి చేయడానికి రెడీ అవుతోంది. వచ్చే వారం రెండు కొత్త ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సాగన్ న్యూట్రిషన్ కంపెనీలు కలిసి సుమారు రూ.770 కోట్లను సేకరించనున్నాయి.
ఈ రెండు ఐపీఓలు పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్‌ఎస్) విధానంలో వస్తుండడంతో, ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు షేర్లను అమ్మిన ప్రమోటర్లు, ఇతర వాటాదారులకి దక్కుతాయి. కంపెనీలకు ఎలాంటి నిధులు రావు. 2026లో ఇప్పటివరకు ఫ్రాక్టల్ అనలిటిక్స్, షాడోఫాక్స్ టెక్నాలజీస్, భారత్ కోకింగ్ కోల్ వంటి దాదాపు 20 కంపెనీలు మెయిన్-బోర్డ్ ఐపీఓల ద్వారా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి.
1. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్
ఈ ఐపీఓ జూన్ 3 నుంచి 5 వరకు ఓపెన్‌లో ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పోర్షన్ జూన్ 2న ప్రారంభమవుతుంది. ప్రతి ఈక్విటీ షేరు ధరను రూ.182–-192 గా నిర్ణయించారు. దీని ద్వారా రూ.630.62 కోట్లను సేకరించనున్నారు. ఈ ఐపీఓలో ప్రమోటర్లు 3.28 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. ఈ షేరు గ్రే మార్కెట్లో ఐపీఓ ధర కంటే రూ.25– 30 ఎక్కువకు ట్రేడవుతోంది.
ఫరీదాబాద్‌కు చెందిన ఈ సంస్థ నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ (అల్యూమినియం, జింక్ అల్లాయ్స్ మొదలైనవి) వ్యాపారంలో ఉంది. దీనికి దేశవ్యాప్తంగా 13 రీసైక్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. హోండా కార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు దీనికి క్లయింట్లుగా ఉన్నాయి. కంపెనీ షేర్లు జూన్ 10న మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
2. హెక్సాగన్ న్యూట్రిషన్
ఈ కంపెనీ ఐపీఓ జూన్ 5న ప్రారంభమై జూన్ 9న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జూన్ 4న ఉంటుంది. ఒక్కో షేరు ధరను రూ.42-–45 గా నిర్ణయించారు. దీని మొత్తం ఇష్యూ సైజ్ దాదాపు రూ.139 కోట్లు. ప్రమోటర్లు 3.08 కోట్ల షేర్లను అమ్ముతారు. 1993లో ప్రారంభమైన ఈ సంస్థ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ రంగంలో పెంటాసూర్, ఒబెసిగో, పీడియాగోల్డ్ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. దాదాపు 75 దేశాల్లో బిజినెస్ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా తమ బ్రాండ్ గుర్తింపు పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హెక్సాగన్ న్యూట్రిషన్ షేర్లు జూన్ 12న లిస్ట్ కావొచ్చు
