గోల్ఫ్​ కార్ట్​ను ఢీ కొట్టిన కారు..

గోల్ఫ్​ కార్ట్​ను ఢీ కొట్టిన కారు..
  • పెండ్లి దుస్తుల్లోనే వధువు మృతి
  • వరుడికి తీవ్ర గాయాలు..  
  • తాగిన మత్తులో మహిళ డ్రైవింగ్..అమెరికాలో ఘోరం

వాషింగ్టన్:  అప్పుడే పెళ్లి జరిగింది.. చర్చిలో ఉంగరాలు మార్చుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. పెండ్లికి వచ్చినోళ్లకు ఘనంగా విందు ఇచ్చారు. ఆపై సరదాగా బీచ్ ఒడ్డున తిరిగొద్దామని గోల్ఫ్ కార్ట్​లో బయలుదేరారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న కార్ట్​ను ఢీ కొట్టింది. దీంతో కొత్త జంటతో పాటు అందులోని డ్రైవర్, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయం కావడంతో పెళ్లి కూతురు అక్కడికక్కడే చనిపోయింది. అమెరికాలోని సౌత్​ కరోలినాలో చోటుచేసుకుందీ విషాదం.


సరదాగా గడుపుదామని వెళ్లి..


ప్రమాదంలో గాయపడ్డ వధూవరులు సమంత హట్కిన్సన్, ఆరిక్ హట్కిన్సన్​గా గుర్తించామని పోలీసులు తెలిపారు. సౌత్​ కరోలినాలోని ఫోలీ బీచ్​ లో  పెళ్లి తర్వాత సరదాగా గడిపేందుకు బీచ్ కు రాగా.. ఇంతలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. తాగిన మత్తులో కారు నడుపుతూ జేమీ కొమొరోస్కీ (25) అనే మహిళ కొత్త దంపతులు వెళుతున్న గోల్ఫ్ కార్ట్​ను ఢీ కొట్టింది. దీంతో ఆ గోల్ఫ్ కార్ట్​ 300 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఆరిక్  తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎముకలు కూడా విరిగిపోయాయి. వెంటనే బాధితుడికి రెండు రీకన్ స్ట్రక్టివ్  సర్జరీలు చేశారని ‘గో ఫండ్ మీ పేజ్’ (ఆపదలో ఉన్నవారికి నిధులు సేకరించే సంస్థ) తెలిపింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారని పేర్కొంది. తన కొడుకు ట్రీట్ మెంట్ తో పాటు కోడలి అంత్యక్రియలకు కూడా సాయం చేయాలని వరుడి తల్లి.. గో ఫండ్  మీ పేజ్ ద్వారా కోరారు.


నమ్మకలేకపోతున్నా.. 


కొత్త జంటకు యాక్సిడెంట్  జరిగిన వార్తను నమ్మలేకపోతున్నానని వరుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘హాస్పిటల్లో నా కొడుకు రింగ్  నాకు ఇచ్చారు. రిసెప్షన్ లో నా కోడలికి అరిక్  తొడిగిన ఉంగరం అది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని ప్రార్థనలు చేశారు. కానీ, కొన్ని గంటల్లోనే నా కుటుంబానికి ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆరిక్  తన ప్రియురాలిని కోల్పోయాడు. ఇప్పటి దాకా గో ఫండ్  మీ పేజ్  ద్వారా రూ.3.15 కోట్లు వచ్చాయి” అని ఆరిక్  తల్లి తెలిపా రు. కాగా, ప్రమాదానికి కారకురాలైన డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ర్యాష్ డ్రైవింగ్​తో పాటు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె గంటకు 105 కి.మి.వేగంతో వెళ్తున్నట్లు కనుగొన్నామని పోలీసులు తెలిపారు.

- వరుడి తల్లి