
సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలానికి చెందిన గిరిజన యువతి మృతి కలకలం రేపుతోంది. చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన అజ్మీరా కోటీశ్వరిని అత్యాచారం చేసి హత్య చేశారని గిరిజన, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశాయి. నిందితులపై చర్యలు తీసుకునేంత వరకు కోటీశ్వరి అంత్యక్రియలు చేసేదిలేదని చెప్పారు కుటుంబ సభ్యులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. కోదాడ ప్రభుత్వాసుపత్రిలో యువతి డెడ్ బాడీని పరిశీలించారు హుజూర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లా తండాకు చెందిన కోటీశ్వరీ నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పీజీ ఎంట్రన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన యువతి… ఘట్ కేసర్ లో హాస్టల్లో ఉంటోంది. ఐతే గత శుక్రవారం ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. కోదాడ హాస్పిటల్లో చూపించిన కుటుంబ సభ్యులు…. అక్కడి నుంచి ట్రీట్మెంట్ కోసం ఖమ్మం తీసుకెళ్లారు. యువతిపై అత్యాచారం జరిగిందని…. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉందని ఖమ్మం డాక్టర్లు తెలిపారు. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం కోటీశ్వరిని హైదరాబాద్ తీసుకెళ్తుండగా చనిపోయింది. యువతి ఆరోగ్య పరిస్థితిపై కోదాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఖమ్మం డాక్టర్లు. యువతి చనిపోవడంతో డెడ్ బాడీని సొంతూరు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించినట్టు తెలుస్తుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు కోటీశ్వరీ డెడ్ బాడీని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే సోమవారం రాత్రి పోస్ట్ మార్టం చేశారు. ఐతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ను పోలీసులు సీక్రెట్ గా ఉంచుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ చేసి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతడిని విచారించడంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.