నీట్, సీబీఎస్ఈ వివాదాలపై కేంద్రం సమాధానం చెప్పాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

నీట్, సీబీఎస్ఈ వివాదాలపై కేంద్రం సమాధానం చెప్పాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

పెద్దపల్లి, వెలుగు: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన  నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యాలకు కేంద్రం సమాధానం చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్​ చేశారు. 

లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు రాస్తుంటే,  ప్రభుత్వం నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నీట్  పేపర్ లీక్, అక్రమాలు బయటపడడం అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల రీవ్యాల్యూయేషన్, ఫలితాలపై వస్తున్న ఆరోపణలు కూడా  విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ అక్రమాలకు  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

ప్రతి విషయాన్ని రాజకీయకోణంలో చూడకుండా మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదని, విద్యార్థుల ఆశలు, వారి కుటుంబాల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టాలన్నారు.