‘స్వలింగ వివాహాల’ వ్యవస్థ కోర్టుల పని కాదు.. చట్టసభలకే వదిలేయండి : కేంద్రం

‘స్వలింగ వివాహాల’ వ్యవస్థ కోర్టుల పని  కాదు.. చట్టసభలకే వదిలేయండి : కేంద్రం

ఢిల్లీ : స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు.. వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్రం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను.. ప్రస్తుతమున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం పేర్కొంది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది.

ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ 17వ తేదీన పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే కేంద్రం వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై కూడా ఏప్రిల్ 18వ తేదీన విచారణ జరుపుతామని తెలిపింది.

సుప్రీంకోర్టులో స్వలింగ వివాహలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 18వ తేదీన విచారణ కొనసాగనుండగా.. ఈలోపు కేంద్రం తన వాదనలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు.. కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్‌ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది. 

స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18వ తేదీ నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.