పంచాయతీలకు మూడో విడత ఆర్థిక సంఘం నిధులు..కేంద్రం నుంచి మరో రూ.387.53 కోట్లు విడుదల

పంచాయతీలకు మూడో విడత ఆర్థిక సంఘం నిధులు..కేంద్రం నుంచి మరో రూ.387.53 కోట్లు విడుదల
  • ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి వచ్చింది రూ.1,034 కోట్లు
  • కేంద్రం వద్ద ఇంకా రూ.2 వేల కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పల్లెలకు ఈ నిధులు కొంత ఊరటనిస్తున్నాయి. మూడో విడతగా తెలంగాణకు రూ.387.53 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, గ్రామీణాభివృద్ధిలో ఈ నిధులు కీలకం కానున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన వేళ ఈ నిధుల రాకతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో రూ.323.44 కోట్లు, రెండో విడతలో రూ.323.45 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. రూ.646.89 కోట్లను (మొదటి, రెండో విడత)  గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. ఆ నిధులతో కరెంట్  బిల్లులు, సిబ్బంది జీతాలు, చిన్నపాటి రిపేర్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మొత్తం మూడు విడతలు కలిపి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం రూ.1,034.42 కోట్ల నిధులు సమకూరినట్లయింది. అయితే, రాష్ట్రానికి  ఇంకా సుమారు రూ.2 వేల కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల ఆలస్యం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావితం చూపుతున్నదని అధికారులు పేర్కొన్నారు.

పల్లెల్లో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
పెండింగ్  నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే నిధుల సమయానుకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులతో పెండింగ్  బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలన్నారు.

గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాధాన్యతా పనులను గుర్తించి వేగవంతం చేయాలని సూచించారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.