
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్(పిలిగ్రిమేజ్రెజువెనేషన్అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) స్కీం కింద రిలీజ్చేసిన ఈ ఫండ్స్‌తో రామాలయంతోపాటు పర్ణశాలలో పనులు చేపట్టనున్నారు. ‘భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు’ అంటూ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్నేతలు నినదించగా, కేసీఆర్ సీఎం హోదాలో మొదటిసారి భద్రాచలం వచ్చినప్పుడు రూ.100కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తర్వాత పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం 2017లో రామాయణం సర్క్యూట్ స్వదేశీ దర్శన్ పేరుతో రూ.30 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్రిపోర్టు) ఇవ్వకపోవడంతో అవి వెనక్కి పోయాయి. ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయ్యాక చొరవ తీసుకుని భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధికి పూనుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెలలో రాష్ట్రానికి రానున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చిన టైంలో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
చేపట్టే పనులివే..
గోదావరి వంతెన దాటి భద్రాచలం టౌన్లోకి ఎంటర్అయ్యేచోట ముఖద్వారంగా రాయితో ఆర్చీ నిర్మించనున్నారు. ఆలయ మాఢ వీధుల్లో స్మార్ట్ పోల్స్, పాత్వే, వీధుల సుందరీకరణ, ప్రధాన ఆలయంలో ఫ్లోరింగ్, రెయిలింగ్, నిత్య కల్యాణ మండపం, ఆంజనేయస్వామి ఆలయం పరిసరాల్లో రూఫింగ్, మిథిలాస్టేడియం ఏరియాలో భక్తులకు ఏర్పాట్లు, భక్తుల కోసం బ్యాటరీ కార్లు, టెంపుల్లో డైనమిక్ లైటింగ్ సిస్టం, సీసీ టీఈలు, ప్రసాదాల తయారీ కేంద్రం ఆధునీకరణ, పిలిగ్రిమ్ అమినిటీ సెంటర్, వ్రత మండపం పనులు చేపట్టనున్నారు.
పర్ణశాలలో..
భద్రాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్ణశాలలోనూ ప్రసాద్ ఫండ్స్ తో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అక్కడ కూడా పిలిగ్రిమ్ అమినిటీ సెంటర్, సోలార్స్ట్రీట్ లైట్లు, టెంపుల్ఏరియాలో సోలార్ లైటింగ్, క్యూలైన్లు ఆధునీకరణ, రామకోటి స్తూపం వద్ద ఫ్లోరింగ్, జంక్షన్లో సోలార్ లైటింగ్, సీతవాగు వద్ద షాపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, తాత్కాలిక రెయిన్ షెల్టర్ల నిర్మాణం, బయోటాయిలెట్లు, సోలార్లైట్ పోల్స్ ఇలా భక్తుల కోసం సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తం రూ.92.4 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా తొలిదశలో రూ.50 కోట్లు మంజూరయ్యాయి.
ఎన్ఓసీలు వచ్చినయ్
గోదావరి వారధి దాటి భద్రాచలంలోకి ప్రవేశించే చోట విజయవాడ-–జగదల్పూర్నేషనల్హైవేపై ఆర్చీ నిర్మించేందుకు నేషనల్ హైవేస్విభాగం నుంచి, భద్రాచలం దేవస్థానం నుంచి, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో పనులకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఈ మూడు శాఖల నుంచి రాష్ట్ర టూరిజం ఆఫీసర్లు బుధవారం ఎన్ఓసీలు( నో అబ్జెక్షన్సర్టిఫికేట్) తీసుకున్నారు.