గవర్నర్​ ఢిల్లీ పర్యటనతో ఆఫీసర్లలో వణుకు

గవర్నర్​ ఢిల్లీ పర్యటనతో ఆఫీసర్లలో వణుకు
  • త్వరలో ఐఏఎస్​, ఐపీఎస్​లకు నోటీసులు..
  • రాష్ట్రంలో డ్రగ్స్​, అవినీతిపై ప్రధాని మోడీ, 
  • హోంమంత్రి అమిత్​షాకు తమిళిసై రిపోర్ట్​

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్​భవన్​ ఆదేశాలు లెక్కచేయని వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్న గవర్నర్​ తమిళిసై.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానాలతో పాటు డ్రగ్స్​ కేసులు, అవినీతిపై స్పెషల్​ రిపోర్టులు అందజేశారు. గవర్నర్​ పర్యటనల్లో ఆఫీసర్లు ప్రొటోకాల్ ఉల్లంఘించడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు  తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్​ను అవమానించటం తమను అవమానించినట్లేనని కేంద్ర హోం మంత్రి అభిప్రాయపడ్డట్లు సమాచారం. నేరుగా ఐపీఎస్​, ఐఏఎస్​ ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. 

రాజ్​భవన్​ ఆదేశాలను పట్టించుకోని ఆఫీసర్లు
కొంతకాలంగా గవర్నర్​ ఆఫీస్​ నుంచి వచ్చే ఆదేశాలను.. గవర్నర్​ టూర్లను రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లు లెక్కచేయటం లేదు. కొన్నిరోజులుగా రాజ్​భవన్​లో ఏ వేడుకకు కూడా  సీఎంతో పాటు మంత్రులెవరూ హాజరుకావడం లేదు. గవర్నర్ అటెండయ్యే ప్రోగ్రామ్​లకు ఐఏఎస్​, ఐపీఎస్​ ఆఫీసర్లు దూరంగా ఉంటున్నారు. మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఫెసిలిటీని గవర్నర్​ కోరగా ప్రభుత్వం నిరాకరించింది. జాతరకు రోడ్డు మార్గంలో వెళ్లిన గవర్నర్​ను ఆఫీసర్లు రిసీవ్​ చేసుకోకపోవటం వివాదాస్పదమైంది. ప్రొటోకాల్​ ప్రకారం స్వాగతించాల్సిన ట్రైబల్​ డిపార్ట్​మెంట్​ సెక్రటరీ, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ గవర్నర్​ వస్తున్నారని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఇటీవల యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన గవర్నర్​కు అదే పరిస్థితి రిపీటైంది. అక్కడ భువనగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీ రిసీవ్​ చేసుకోలేదు. ఆలయ ఈవో కూడా అక్కడ లేకపోవటం వార్తల్లోకెక్కింది. గవర్నర్​ పర్యటనల్లో ప్రొటోకాల్​ ఉల్లంఘించిన ఆఫీసర్లందరికీ కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసి, వివరణ కోరే అవకాశాలున్నాయి. గవర్నర్​ను అవమానించిన ఘటనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆఫీసర్లలో టెన్షన్​ మొదలైంది. ఇక్కడి రాజకీయాలకు అడకత్తెరలో పోక చెక్కలా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక సీనియర్​ ఐఏఎస్ ఆఫీసర్​ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, రాజ్​భవన్​ మధ్య దూరం, గవర్నర్​ను అవమానిస్తున్న తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 

ఢిల్లీ తెలంగాణ భవన్​లోనూ పట్టించుకోలె
సాధారణంగా ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర గవర్నర్​ను అక్కడి తెలంగాణ భవన్ రెసిడెంట్​ కమిషనర్​ రిసీవ్​ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ..  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్​కు కమిషనర్​ స్వాగతం పలుకలేదు. రెండు రోజులుగా భవన్​లోని శబరి బ్లాక్​లో గవర్నర్​ ఉంటున్నా ఆ వైపు చూడలేదు. ఈ విషయం కూడా ప్రొటోకాల్ వివాదానికి తావిచ్చింది. సీఎం ఢిల్లీలో ఉన్నందుకు తాను రాలేకపోతున్నట్లు రెసిడెంట్​ కమిషనర్ ముందుగానే​ సమాచారం ఇచ్చినట్లు ఢిల్లీ తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.