చలో ప్రగతి భవన్ ఉద్రిక్తం

చలో ప్రగతి భవన్ ఉద్రిక్తం
  • గాంధీ భవన్​లో జగ్గారెడ్డి, ఓయూ జేఏసీ నేతలను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఓయూ విజిట్​కు అనుమతివ్వాలంటూ కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన చలో ప్రగతి భవన్​ ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీకి సెలవు ఉండటంతో సర్కారు జోక్యం చేసుకోవాలనే డిమాండ్​తో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి నేతృత్వంలో ఓయూ జేఏసీ విద్యార్థులు బుధవారం సాయంత్రం 5 గంటలకు ‘చలో ప్రగతి భవన్’కు పిలుపునిచ్చారు. దీంతో గాంధీ భవన్​ వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎవరూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగ్గారెడ్డి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు రాహుల్​ ఓయూకు వస్తున్నారని, దీనికి అనుమతి నిరాకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకపోయినా రాహుల్​ను ఓయూకు తీసుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు.

ఓయూలోనూ టెన్షన్ టెన్షన్

రాహుల్ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరగా ఆర్ట్స్ కాలేజీ వద్ద వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతివ్వాలని నిరోద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ డిమాండ్​ చేశారు. అలాగేఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసనకు దిగిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులనూ అరెస్ట్ చేశారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే ​విద్యార్థి ఉద్యమాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని లెఫ్ట్​ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.