అమెరికాలో బ్యాంకుల మూసివేత..భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం ఎంత..?

అమెరికాలో బ్యాంకుల మూసివేత..భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం ఎంత..?

అమెరికాలో వరుసగా రెండు బ్యాంకులు మూసివేయడంపై  ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు దివాలా తీయడంతో వివిధ దేశాల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్..నష్టాలకు చేరుకున్నాయి. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ గత నెల కంటే కిందికు దిగజారింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం, సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేతతో ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌  897.28 పాయింట్ల నష్టంతో 58,237.85 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 దగ్గర ముగిసింది. 

మరోవైపు అమెరికాలోని మరో బ్యాంకులు దివాలా తీయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్రమంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఏ విధమైన  ప్రభావం ఉండనుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బ్యాంకుల మూతివేత ప్రతికూల ప్రభావం చూపినా... భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్తులు, అప్పుల నిర్వహణలో  భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందంటున్నారు. ఇందుకు దేశీయ బ్యాంకులు స్థానిక డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతుండడమే కారణమని పేర్కొంటున్నారు. డిపాజిట్ల ద్వారా సేకరించిన నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే మదుపు చేస్తున్నారని చెబుతున్నారు. 

దేశీయ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ..నియంత్రణ బలంగా ఉందని ఆర్థిక నిపుణులు తెలిపారు. సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకుల ప్రభావం భారత బ్యాంకులపై అంతగా ఉండదని చెప్తున్నారు. అయితే కొద్ది కాలం పాటు..దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.  దేశీయంగా ఉన్న  బ్యాంకుల్లో దాదాపు 60 శాతం వరకు  సామాన్య ప్రజలే డిపాజిట్లు చేశారని పేర్కొన్నారు.