సీఎం హామీ ఇచ్చి ఆరేండ్లయినా పరిహారం రాకపాయె..!

సీఎం హామీ ఇచ్చి ఆరేండ్లయినా పరిహారం రాకపాయె..!
  • మహా పాదయాత్రతో నాడు సర్కారును కదిలించిన ఐక్యవేదిక
  • నేడు వేములవాడ రాజన్న సాక్షిగా మరోసారి కార్యాచరణ 

బోయినిపల్లి,వెలుగు:   ‘‘ఆర్​ అండ్​ ఆర్​ కింద కడుతున్న కాలనీలో మీకు  ఉండడం ఇష్టమో కాదో తెలవది. మిడ్​మానేరు కింద ఇండ్లు పోయిన వారికి ప్రభుత్వం చేపట్టిన  డబుల్​ బెడ్​రూం స్కీమ్​ కింద ఇస్తున్నట్టే రూ. 5 లక్షల 4 వేలు నెట్​ అమౌంట్​ వచ్చేలా చూస్తా. మీరు కావాలంటే కాలనీలోనే ఇల్లు కట్టుకోండి. లేదంటే టౌన్​లో కట్టుకోండి. అది మీఇష్టం’’
– ఇవి సీఎం కేసీఆర్​ 2015 జూన్ 18న వేములవాడ రాజన్న సాక్షిగా చెప్పిన మాటలు..

మిడ్​మానేరు ప్రాజెక్ట్​ కట్ట 2016   సెప్టెంబర్ 26న తెగిపోయింది.  ఈ సందర్భంగా  ముంపు గ్రామాలకు చెందిన  18  ఏళ్లు నిండిన యువతీ యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చారు.  అలాగే ఎన్నికల సందర్భంగానో.. అభివృద్ధిపనుల ప్రారంభోత్సవాల సందర్భంగానో మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్​, చెన్నమనేని రమేశ్​​బాబు కూడా నిర్వాసితులకు అనేక హామీలిచ్చారు. పరిహారాన్ని పెంచుతామని.. ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రియల్​ కారిడార్​ ఏర్పాటు చేస్తామని హామీలు మీద హామీలు గుప్పించారు. కానీ.. స్వయానా సీఎం హామీలే అమలుకు నోచుకోకపోవడం నిర్వాసితులను ఆవేదనకు గురిచేస్తోంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద రెండు లక్షల 32 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 27.5 టీఎంసీ ల కెపాసిటీతో  2006 లో మిడ్ మానేరు ప్రాజెక్టును చేపట్టగా.. 13  ఏండ్ల తర్వాత  2019   నవంబర్ లో ప్రాజెక్టు పూర్తయింది. ఈ ప్రాజెక్టులో  బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలంలోని కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాబాష్ పల్లి, అనుపురం, రుద్రవరం, కొడిముంజ,  చిర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రంవానిపల్లి గ్రామాలు పూర్తిగా,   ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాలు పాక్షికంగా  ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాల్లోని 11,731  కుటుంబాలు ముంపుకు గురయినట్టు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం, ఒక్కొక్కరికి వారి వృత్తి ఆధారంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మిడ్ మానేరును నీటితో నింపడంతో  ముంపు గ్రామాల ప్రజలు ఆర్​అండ్ ఆర్​ కాలనీల్లో అవస్థలు పడుతున్నారు.
 
యువతకు అందని పరిహారం.. 
మిడ్ మానేరుకు  గోదావరి జలాలు వచ్చే టైమ్​లో 2019 ఆగస్టు 16 న   సీఎం కేసీఆర్  మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ లతో   ఫోన్​లో మాట్లాడారు. రైతులు, ఆయా గ్రామాల ప్రజలు నీళ్లొచ్చిన  విషయంలో ఏమనుకుంటున్నారని ఆరా తీశారు. రూ. 2 లక్షల ప్యాకేజీ గెజిట్​లో  కొందరి వివరాలు తప్పు వచ్చాయని, దాని వల్ల చాలామంది యువకులకు పరిహారం అందడంలేదని, వాటిని సరిచేయాలని వివరించారు. అప్పుడు సరేనన్న సీఎం ఆతర్వాత పట్టించుకోలేదు.

సీఎంతో మాట్లాడతానన్న కేటీఆర్​.. 
మిడ్​మానేరు నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్​ ఇటీవల హామీ ఇచ్చారు. ఈనెల 16న కొదురుపాక లో రైతు వేదికను  ప్రారంభించారు. లోకల్​ ఎమ్మెల్యే రవిశంకర్​ నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించగా మంత్రి స్పందించారు.

నేడు ఐక్య వేదిక  సమావేశం 
మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్  హామీ ఇచ్చి ఆరేళ్లు పూర్తవుతున్నందున శుక్రవారం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేములవాడ నంది కమాన్ దగ్గర మీటింగ్​ ఏర్పాటు చేశారు. తమ సమస్యలపై భవిష్యత్​ కార్యచరణపై చర్చించాలని భావిస్తున్నారు. 

పోరుబాట పట్టిన  నిర్వాసితులు
సీఎం, ఇతర నేతలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ముంపు గ్రామాల ఐక్యవేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు.  2019  జులై 31 న  బోయినపల్లి మండలం నీలోజిపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ముంపు గ్రామాల నుంచి 10 వేల మంది నిర్వాసితులు తరలి వచ్చారు.   అదే ఏడాది ఆగస్టు 30న సీఎం కేసీఆర్ అత్తగారి ఊరైన బోయినిపల్లి మండలం కొదురుపాకలో  ఐక్య వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  టీజేఎస్​ ప్రెసిడెంట్​ కోదండరాం,సీపీఐ కార్యదర్శి  చాడ వెంకట్ రెడ్డి, కరీంనగర్  మాజీ ఎంపీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. గతేడాది నిర్వాసితుల సమస్యలను కాంగ్రెస్​ నేతలు  గవర్నర్ తమిళిసై  సౌందర్ రాజన్   దృష్టికి కూడా తీసుకెళ్లారు. బహిరంగ సభ తర్వాత  చొప్పదండి  ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను అడ్డుకున్నారు.  రాజన్న ఆలయం ముందు భిక్షాటన చేయాలని నిర్ణయించినా..  ఐక్యవేదిక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. 2020లో సీఎం కొండపోచమ్మ సాగర్ కు మిడ్ మానేరు ద్వారా నీటిని తీసుకెళ్లిన టైమ్​లో  ఒక్కరోజు జన జాగరణ దీక్ష చేశారు.  

ప్రాణ త్యాగానికైనా సిద్ధం
సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. లేకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఇప్పటికే ఎన్నో సార్లు ఆందోళన చేశాం. మరోమారు ఆందోళన చేసేందుకు సిద్ధం.   – కూస రవీందర్, మిడ్ మానేరు ఐక్య వేదిక అధ్యక్షుడు  

ఇవీ డిమాండ్లు... 

  • మిడ్ మానేరు  నిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల4 వేలు ఇవ్వాలి.
  • ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ  రూ.5  లక్షల పరిహారం, భూమి పట్టా ఇవ్వాలి. 
  • వివిధ కారణాలతో పరిహారం ఇంకా తీసుకోని వారికీ వెంటనే పరిహారం చెల్లించాలి. 
  • ప్రతి గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. 
  • సంకపెల్లి,అరెపల్లి,  గ్రామాలలో ఎస్టిమేట్  చేసిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలి.