కలెక్టరేట్ పూర్తయి 8 నెలలైనా ఓపెన్ చేస్తలే

కలెక్టరేట్ పూర్తయి 8 నెలలైనా ఓపెన్ చేస్తలే
  • నిజామాబాద్ కలెక్టరేట్ పూర్తయి 8 నెలలు
  • కేసీఆర్​తో ప్రారంభించాలని వెయిటింగ్
  • ప్రైవేట్ బిల్డింగులకు నెల నెలా లక్షల రెంట్

నిజామాబాద్, వెలుగు: రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి సొంత జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్ పూర్తయినా సీఎం కేసీఆర్​ రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. బిల్డింగ్ ​పూర్తయి 8 నెలలవుతున్నా చాలా ప్రభుత్వ ఆఫీసులు నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగిస్తుండడంతో కిరాయి రూపంలో రూ. లక్షలు వృథా అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ సమీపంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్​నిర్మాణానికి 2017 అక్టోబర్ లో శంకుస్థాపన చేశారు. బిల్డింగ్​నిర్మాణానికిరూ. 58.7 కోట్లు వెచ్చించారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ముఖ్య అధికారుల ఛాంబర్లతోపాటు మొత్తం 34 శాఖల ఆఫీసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్​లో 34, ఫస్ట్ ఫ్లోర్​లో 23 , సెకండ్​ ఫ్లోర్​లో 28 రూమ్స్​వివిధ శాఖలకు కేటాయించారు. సీఎం చేతుల మీదుగా బిల్డింగ్​ను ప్రారంభించాలని అనుకున్నారు. ఈ ఏడాది జూన్​20న సీఎం రాక కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ టూర్​క్యాన్సిల్​అయ్యింది. మళ్లీ సెప్టెంబర్​లో సీఎం టూర్​ఖరారు చేసినా చివరి క్షణంలో వాయిదా పడింది. ఈ నెలలో ఎమ్మెల్సీ కవిత మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కలెక్టరేట్​ప్రారంభిస్తారన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. 

నెలకు రూ. 5 లక్షలకు పైగా కిరాయి
జిల్లా కేంద్రంలో పది వరకు ప్రభుత్వ ఆఫీసులను ప్రైవేట్ బిల్డింగ్​లలో నిర్వహిస్తున్నారు. కిరాయి రూపంలో ప్రతి నెలా రూ. 5 లక్షల 
వరకు చెల్లిస్తున్నారు. 9 నెలల్లో ఇలా రూ. 45 లక్షల వరకు చెల్లించారు. మరోవైపు ప్రారంభానికి ముందే కొత్త కలెక్టరేట్​లో సమస్యలు బయటపడుతున్నారు. ఇటీవలి వరదలకు కలెక్టరేట్​కాంప్లెక్స్​ముందు భారీగా నీరు చేరింది. డ్రైనేజీ పూడికతో నిండడంతో నీరు నిలిచిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతం కావడం వల్ల నీరు నిలవడం పెద్ద లోపం కాదని ఆఫీసర్లు చెబుతున్నారు. 

అంతా రెడీ
ఆధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్​నిర్మించాం.  పాత కలెక్టరేట్ నుంచి కొత్త కలెక్టరేట్​లోని రూమ్​లకు మారడమే మిగిలింది. సీఎం వచ్చి రిబ్బన్ కట్ చేసుడే ఆలస్యం. ఆఫీసులన్నీ కొత్త బిల్డింగ్​లో షురూ అవుతయ్.
- గంగాధర్,​ ఆర్అండ్ బీ ఇన్​చార్జి ఆఫీసర్, నిజామాబాద్​​

ఖజానాపై భారం పడుతోంది
జిల్లా కేంద్రం నడిబొడ్డున 50 సంవత్సరాల అవసరాలకు ఉపయోగపడేలా పాత కలెక్టరేట్ ఉంది. అయినా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం, ఖానాపూర్, కాలూరు నగర శివార్లలో రియల్ భూం పెంచేందుకు కొత్త కలెక్టరేట్ కట్టిన్రు. ఇప్పుడు కలెక్టరేట్​ ఓపెనింగ్​ జాప్యంతో ఖజానాపై భారం పడుతోంది.

- భాస్కర్, టీజేఏసీ కోకన్వీనర్,​ నిజామాబాద్