మీరందరూ హైదరాబాద్ హోటల్కు వచ్చేయండి : కాంగ్రెస్ ఆదేశం

మీరందరూ హైదరాబాద్ హోటల్కు వచ్చేయండి : కాంగ్రెస్ ఆదేశం

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పై ఎక్కడ చూసినా, విన్నా ఇదే చర్చ. ఆదివారం (డిసెంబర్ 3న) అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక అడుగు ముందుగానే ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా అలర్ట్ గా కనిపిస్తోంది. 

కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం చాలా అలర్ట్ గా ఉంది. తమ పార్టీ నుంచి గెలిచినవారు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా.. వారిని కాపాడుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం.. సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. హైదరాబాద్ కు రావాలని ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులందరికి అధిష్టానం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హోటల్ కు రావాలని చెప్పారు. 

అనుమానం ఉన్న అభ్యర్థులను శనివారం (డిసెంబర్ 2) రాత్రికే హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఇప్పటికే తాజ్ కృష్ణా హోటల్ లో రూమ్స్ బుక్ చేసింది తెలంగాణ పీసీసీ. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులతో టచ్ లో ఉన్న నేతలపై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న నాయకుల కదలికలపై నిఘా పెట్టారు. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల ఏజెంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసి కోరారు. అయితే.. అలాంటి వెసులుబాటు ఏదీ లేదని వికాస్‌ రాజ్‌ కాంగ్రెస్ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే.. అభ్యర్థి నిర్దేశించిన ఆథరైజ్డ్ పర్సన్ కు ఎన్నిక ధృవీకరణ పత్రం ఇవ్వొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జీ. నిరంజన్ చెబుతున్నారు. అయితే.. ఆ ఆథరైజ్డ్ పర్సన్ ను రిటర్నింగ్ అధికారి గుర్తు పట్టే వ్యక్తి అయ్యి ఉండాలని వికాస్ రాజ్ తమకు చెప్పారని అంటున్నారు.