
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మరోసారి పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పైపులైన్‌లతో నీళ్లందించే ప్యాకేజీ -21 సహా ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చులు భారీగా పెంచారు. శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2.5 లక్షల ఎకరాలకు పైపులైన్‌లతో నీళ్లిచ్చే ప్యాకేజీ - 21(ఏ) పనులు రూ.2,600 కోట్లతో చేపట్టగా ఆ పనుల అంచనా వ్యయాన్ని 40 శాతం పెంచేశారు. రూ.3,650 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేట్లు ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు (అడిషనల్ టీఎంసీ కలుపుకొని) కోసం ఇప్పటి వరకు రూ.94,730 కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా అదనంగా రూ.14,395 కోట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిర్మాణ వ్యయం రూ. 49,595 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.21,815 కోట్లు ఖర్చు చేయగా ఇందులో బడ్జెట్ నుంచి రూ.14వేల కోట్లు, లోన్‌ల నుంచి రూ. 7,750 కోట్లు వెచ్చించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని 8,083 ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.156 కోట్లతో వెల్జీపూర్ ఎత్తిపోతల స్కీం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.