ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. 2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న గిల్ ను వన్డే సారధిగా ఉంచాలని సెలక్టర్లు భావించారు. అయితే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తన అసంతృప్తిని నిరాశ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం ఉండవచ్చని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను నియమించాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ను గంభీర్ ఒత్తిడి చేసి ఉండవచ్చని తివారి అభిప్రాయపడ్డాడు. మనోజ్ తివారి మాట్లాడుతూ.. "ప్రధాన కారణం ఏమిటో నాకు తెలియదు. కానీ అజిత్ అగార్కర్ గురించి నాకు కొంత తెలుసు. ఆయన బలమైన వ్యక్తిత్వం కలవాడు. అతన్ని గంభీర్ ప్రభావితం చేసి ఉంటాడని నాకు అనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన విషయం. రోహిత్ శర్మ ఆటగాళ్ల కెప్టెన్. అతను ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. రోహిత్ జట్టు కెప్టెన్ అదేవిధంగా దేశ కెప్టెన్. రోహిత్ ను కెప్టెన్ నుంచి తొలగించే సమయానికి బీసీసీఐ అగ్రశ్రేణి అధికారి జై షా ఐసీసీ చైర్మన్ అయ్యాడు.
జైషా జోక్యం చేసుకొని రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించకుండా ఉండాల్సింది. అదృష్టం ఉంటే శుభ్‌మాన్ గిల్ గెలవగలడు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ నేను ఎల్లప్పుడూ అవకాశాల శాతాన్ని పరిశీలిస్తాను. ఏ కెప్టెన్ మనకు ప్రపంచ కప్‌ను గెలుచుకునే అవకాశం కోసం వెతకాలి. శుభ్‌మాన్ విషయంలో 60 శాతం ఉంటే రోహిత్ కెప్టెన్సీలో 85 శాతం ఇండియా మ్యాచ్ లు గెలిచే హామీ ఉంది". అని తివారీ ఇండియా టుడే సోదర ఛానల్ స్పోర్ట్స్ టాక్‌తో అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ కెప్టెన్సీకి చెక్:
చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది. ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఇటీవలే ఐపీఎల్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.
