BBL 2025-26: బాబర్ బౌలర్ అనుకున్నావా.. ఈజీ సింగిల్ నిరాకరించిన స్మిత్.. ఆ తర్వాత ఓవర్లో విధ్వంసం

BBL 2025-26: బాబర్ బౌలర్ అనుకున్నావా.. ఈజీ సింగిల్ నిరాకరించిన స్మిత్.. ఆ తర్వాత ఓవర్లో విధ్వంసం

మ్యాచ్ లో ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఫ్యాన్స్ కు కన్నుల పండగే. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తే స్టేడియం మారుమ్రోగిపోతుంది. బిగ్ బాష్ లీగ్ లో కూడా అలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ తరపున స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశారు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం (జనవరి 16) జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ పై ఆడుతున్న వీరిద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఊహించని సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. గ్రీన్ వేసిన 11 ఓవర్లో బాబర్ వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడాడు. దీంతో స్మిత్ కాస్త అసహనానికి గురయ్యాడు. చివరి బంతికి బాబర్ లాంగాఫ్ దిశగా కొట్టినా స్మిత్ సింగిల్ కు రావడానికి నిరాకరించాడు. ఈ సీన్ షాకింగ్ కు గురి చేసింది. క్రీజ్ లో బాబర్ లాంటి స్టార్ ప్లేయర్ ఉన్నా స్మిత్ సింగిల్ వద్దనడానికి కారణం తెలియలేదు. అయితే ఆ తర్వాత ఓవర్లోనే స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ర్యాన్ హ్యడ్లి వేసిన ఈ ఓవర్ లో తొలి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు కొట్టిన స్మిత్ ఐదో బంతికి ఫోర్ బాదాడు. ఓవరాల్ గా ఈ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. అంతేకాదు ఈ మ్యాచ్ లో స్మిత్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తనలోని విశ్వరూపం చూపించాడు. 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్.. ఆతర్వాత బంతికే ఔటయ్యాడు. ఓవరాల్ గా 42 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు బాబర్ అజామ్ 39 బంతుల్లో 47 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 

స్మిత్ సెంచరీతో సిక్సర్స్ విజయం:
 
ఈ మ్యాచ్ విషయానికి వస్తే అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు  చేసింది. వార్నర్ సెంచరీతో చెలరేగాడు. ఛేజింగ్ లో సిడ్నీ సిక్సర్స్ 17.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. స్మిత్ 41 బంతుల్లోనే సెంచరీ చేసి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.