- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ.. రా రైస్ కన్నా స్టీమ్ రైస్‌లోనే రుచి, నాణ్యత
- పుష్కలంగా ఖనిజ లవణాలు ఉంటాయంటున్న నిపుణులు.. ఎగుమతుల్లోనూ టాప్
- సౌత్ ఇండియాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ వినియోగం
హైదరాబాద్, వెలుగు: పంటల సాగులో ఎన్నో మార్పులు వచ్చాయి. యంత్రాలతో కోసి అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజులే నిల్వ ఉంచి మిల్లింగ్ చేయడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నది. వడ్లు వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. దీన్ని అధిగమించడానికే స్టీమ్ రైస్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయక రా రైస్ (వైట్ రైస్) కన్నా స్టీమ్ రైస్ (పార్‌బాయిల్డ్ రైస్)కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది.
రా రైస్‌తో పోలిస్తే ఎక్కువ పోషకాలు, రుచి, నాణ్యత, ఖనిజ లవణాల్లో స్టీమ్ రైస్ ముందంజలో ఉంటున్నదని నిపుణులు చెప్తున్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఎక్స్‌పోర్ట్‌లోనూ స్టీమ్ రైస్‌కు డిమాండ్ పెరిగింది. 2025లో ఇండియా నుంచి రైస్ ఎక్స్‌పోర్ట్ 21.55 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇందులో పార్‌బాయిల్డ్ రైస్ 8-9 మిలియన్ టన్నుల వాటా ఉంది. ఇది పోషకాల పవర్‌హౌస్‌గా మారుతున్నది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి స్టీమ్ రైసే బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రా రైస్‌కు బదులుగా స్టీమ్ రైస్ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్నది.
స్టీమ్ రైసే బెటర్
స్టీమ్ రైస్ తయారీ ప్రక్రియ ప్రత్యేకమైనది. ధాన్యాన్ని ముందుగా నీటిలో నానబెట్టి, ఆవిరి ద్వారా ఉడికించి, ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ధాన్యం పొట్టు (హస్క్), తవుడు (బ్రాన్)లోని పోషకాలు గింజలోకి చేరుతాయి. సాధారణ రా రైస్‌లో మిల్లింగ్ సమయంలో బ్రాన్, జెర్మ్ తొలగిపోతాయి. దీంతో పోషకాలూ తగ్గుతాయి. కానీ.. స్టీమ్ రైస్‌లో ఇది జరగదు. ఫలితంగా విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా నిల్వ ఉంటాయి. ఇంతకుముందు వరి కోసిన తర్వాత ఆరబెట్టి, నిల్వ చేసి మరపట్టించేవారు.
కానీ, ఇప్పుడు యంత్రాలతో కోతలు, అధిక తేమతో ధాన్యం నిల్వ సమస్యలు పెరిగాయి. ఇప్పుడు అధిక తేమతో ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. స్టీమ్ ప్రక్రియ దీన్ని అధిగమిస్తుంది. పాలిషింగ్ టైమ్‌లో సూక్ష్మ పోషకాల నష్టం కూడా తక్కువ. దీంతో వినియోగంలో కూడా స్టీమ్ రైస్ ముందంజలో ఉంది. కుక్ చేసిన అన్నం పొడిగా, విడివిడిగా ఉంటుంది. 3 నుంచి 4 గంటల వరకు రుచిగా ఉంటుంది. గట్టిపడదు.. నీరు కారదు.. చెడిపోదు. ఇది అన్నిరకాలుగా ఆదర్శమైనది.
దేశీయంగా పెరుగుతున్న ఆదరణ
ఇండియాలో స్టీమ్ రైస్ వినియోగం 60%కు చేరుకుం ది. ముఖ్యంగా సౌత్ ఇండియాతో పాటు తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో పాపులర్‌గా మారింది. సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్)లో దీని వాడకం పెరిగింది.
ఎక్స్‌పోర్ట్‌లో స్టీమ్ రైస్ డిమాండ్
పార్‌బాయిల్డ్ రైస్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే ఇండి యా ముందంజలో ఉన్నది. ప్రధానంగా వెస్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతున్నది. 2024-–25లో ఎక్స్‌పోర్ట్ విలువ 4-5 బిలియన్ డాలర్లు. గ్లోబల్ మార్కెట్‌లో ఇండియన్ పార్‌బాయిల్డ్ రైస్ డిమాండ్ పెరుగుతున్నది.
స్టీమ్ రైస్‌తో ఉపయోగాలివే..
‘‘స్టీమ్ రైస్ కుకింగ్ టైమ్ తగ్గిస్తుంది. పోషకాలు నిల్వ ఉంచుతుంది’’అని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంచనాల ప్రకారం.. దేశంలో రైస్ ప్రొడక్షన్ 137.82 మిలియన్ టన్నులు, ఇందులో స్టీమ్ రైస్ షేర్ గణనీయంగా పెరుగుతున్నది. ‘‘రైస్ ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో హెల్తీ డైట్‌కు అనువైనది. స్టీమ్ రైస్ బ్రౌన్ రైస్ కంటే ఆరోగ్యకరమైనది. ఎందుకంటే బ్రాన్ తీసేసినా పోషకాలు నిల్వ ఉంటాయి’’అని అహార నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, ఐరన్ 2 రెట్లు, మెగ్నీషియం ఎక్కువ, ఫైటిక్ యాసిడ్ తక్కువ కావడంతో పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనత, విటమిన్ బీ లోపాలు తగ్గిస్తుందని చెప్తున్నారు. రా రైస్‌తో పోలిస్తే ఎక్కువ ఫైబర్, విటమిన్లు ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ. ఈ ప్రక్రియలో రైతులకు ధాన్యం ఆరబెట్టడం, నిల్వచేయడం అక్కర్లేదు. సంక్షేమ పథకాలకు స్టీమ్ రైస్ అనుకూలం. సాధారణ బియ్యంతో పోలిస్తే దండిగా పోషకాలు, నిల్వ సామర్థ్యం పెరుగుతాయి. అధిక తేమతో ధాన్యాన్ని సులభంగా స్టీమ్ రైస్‌గా మార్చొచ్చు. పోషకాల లోపం, అనీమియా వంటి సమస్యలకు ఇది కీలక పరిష్కారం. వినియోగదారులు హెల్తీ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్టీమ్ రైస్ భవిష్యత్ ట్రెండ్ అవుతుంది.
