ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ.. భారతీయ టెక్ జాబ్ మార్కెట్ 2026లో మంచి ఉద్యోగ అవకాశాలను అందించబోతోంది. ప్రముఖ వర్క్ సొల్యూషన్స్ ప్రొవైడర్ 'అడెక్కో ఇండియా' తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో టెక్ ఉద్యోగాల మార్కెట్ 12 నుండి 15 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. దీనివల్ల సుమారు లక్ష 25వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయట. ఇందులో పర్మనెంట్, టెంపరరీ, కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు ఉండటం విశేషం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలు మార్కెట్‌ను శాసించబోతున్నాయి 2026లో.
ఏఐ కేవలం ప్రయోగాలకు మాత్రమే పరిమితం కాకుండా, సంస్థల ప్రధాన అవసరంగా మారింది. ఏఐ, డేటా అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో డిమాండ్ ఏకంగా 51 శాతం పెరిగింది. దాదాపు 40 శాతం పెద్ద కంపెనీలు ఇప్పటికే జెనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాయి. దీనివల్ల మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లు, ఏఐ నైపుణ్యాలు కలిగిన ఫుల్-స్టాక్ డెవలపర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ నైపుణ్యాలు ఉన్న నిపుణులకు ఇచ్చే ప్యాకేజీలు కూడా 15 శాతం వరకు పెరగడం గమనార్హం.
ALSO READ : 6 నిమిషాల్లో ఇంటికొచ్చిన బ్లింకిట్ అంబులెన్స్..
నాన్-టెక్ రంగాల్లోనూ టెక్ జోరు టెక్నాలజీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ వంటి నాన్-టెక్ రంగాలు కూడా ఇప్పుడు ఏఐ, డేటా సామర్థ్యాలను తమ కార్యకలాపాల్లో భాగం చేసుకుంటున్నాయి. టెక్ సంబంధిత నియామకాల్లో ఈ రంగాలు దాదాపు 38 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా తమ నియామకాలను 20 శాతం పెంచాయి. ముఖ్యంగా ఏవియేషన్, ఎనర్జీ, రిటైల్ రంగాల్లో డిజిటల్ భద్రతా నిబంధనల వల్ల సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీగా అవకాశాలు లభిస్తున్నాయి.
కంపెనీలు కేవలం అనుభవజ్ఞులనే కాకుండా, ఫ్రెషర్లను కూడా ప్రోత్సహిస్తున్నాయి. 2024తో పోలిస్తే క్యాంపస్ సెలెక్షన్స్ 12 శాతం పెరగడం సానుకూల పరిణామం. డీప్-టెక్, ఫిన్‌టెక్, హెల్త్-టెక్ స్టార్టప్‌లు ఈ డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. 2026 నాటికి టెక్ పరిశ్రమ నియంత్రణ దశ నుంచి రెన్యూవల్ దశకు మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తగిన నైపుణ్యాలు పెంచుకున్న అభ్యర్థులకు 2026 ఒక గోల్డెన్ ఇయర్ కాబోతోంది. దీంతో టెక్కీలకు ప్రస్తుత లేఆఫ్ మార్కెట్లో కొత్త అవకాశాల వెలుతురు రాబోతుందని రిపోర్ట్ పేర్కొంది.
