మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఈ హామీ ఇచ్చిన పార్టీ గెలుస్తుందా..?

మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఈ హామీ ఇచ్చిన పార్టీ గెలుస్తుందా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హీట్ జోరందుకుంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం  కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తే..  తమిళనాడులో AIADMK పార్టీ  మగవారికి ఉచిత బస్సు ప్రయాణం ప్రకటిస్తూ సంచలనం రేపింది.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే (AIADMK) పార్టీ సంచలన హామీలు ప్రకటించింది. పార్టీ అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రకటించిన ఈ 5 ప్రధాన హామీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన తర్వాత ఎఐఎడిఎంకె పార్టీ  కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పళనిస్వామి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశాలు పూర్తయిన తర్వాత, మరిన్ని ఎన్నికల వాగ్దానాలు చేస్తామని అన్నారు. ఆ హామీలు ఏంటంటే..... 

ALSO READ : 6 నిమిషాల్లో ఇంటికొచ్చిన బ్లింకిట్ అంబులెన్స్..

*మహిళలకు నెలకు రూ. 2,000: 'మగలిర్ కులవిలక్కు' పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ. 2వేలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో వేస్తామని ప్రకటించారు.
 
*మగవాళ్లకు కూడా ఉచిత బస్సు: ప్రస్తుతం మహిళలకు ఉన్నట్లే, ఇకపై మగవారికి కూడా సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 *అందరికీ పక్కా ఇళ్లు: గ్రామాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే అమ్మ గృహ నిర్మాణ పథకం కింద  స్థలం ఇచ్చి, కాంక్రీట్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో అయితే ప్రభుత్వం స్థలం కొని అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇల్లు ఇస్తామని తెలిపింది. ఎస్సీ (SC) కుటుంబాలకు ఒకే ఇంట్లో ఉంటూ పెళ్లయిన తర్వాత వేరుగా ఉండాలనుకునే కొడుకులకు కూడా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు కట్టించనుంది. 

ALSO READ : భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం

*150 రోజుల ఉపాధి హామీ: ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి ప్రకటించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ రోజులు పని దొరుకుతుంది.

'*అమ్మ ద్విచక్ర వాహన పథకం' కింద 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 25వేల సబ్సిడీతో స్కూటర్లు అందజేస్తారు.  

*రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్న సమయంలో ఈ ఉచిత పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా.. "పరిపాలన చేసే తెలివితేటలు ఉంటే ఇవన్నీ సాధ్యమే" అని ఆయన సమాధానమిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో  అన్నా డీఎంకే గృహిణులకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా, అన్నా డీఎంకే సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కూడా హామీ ఇచ్చింది.

కానీ రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆదాయం పెరుగుతుందని డీఎంకే తెలిపింది. డీఎంకే ప్రభుత్వం అప్పులను పెంచిందని, మా హయాంలో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నాడీఎంకే గుర్తు చేసింది.