సీజన్ మొదలై రెండు నెలలైనా.. యాసంగి పంటల నమోదు ఇంకా షురూ చెయ్యలే

సీజన్ మొదలై రెండు నెలలైనా.. యాసంగి పంటల నమోదు  ఇంకా షురూ చెయ్యలే
  •    సీజన్ మొదలై రెండు నెలలు అవుతున్నా దృష్టి పెట్టని వ్యవసాయశాఖ
  •     మద్దతు ధర అమలుకుక్రాప్​బుకింగ్ తప్పనిసరి
  •     జాప్యంతో ఎంఎస్పీపై రైతుల్లో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియ ఇంకా షురూ కాలేదు. వ్యవసాయ శాఖ ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం రైతులను ఆందోళన గురిచేస్తున్నది. యాసంగి పంటల్లో మక్క, పప్పుశనగ, ఇతర తృణ ధాన్యాలు ముందుగానే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకునే అవకాశం ఉంది. పంటల నమోదు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర  అమలుకు అడ్డంకిగా మారుతుంది. రైతులకు సరైన ధర దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.

మరో నెలరోజుల్లో పంట చేతికి వచ్చే చాన్స్

యాసంగి సీజన్ సాధారణంగా నవంబర్​నుంచి మే నెల వరకు సాగుతుంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మక్కజొన్న, పప్పుశనగ, వేరుశనగతో పాటు జొన్న, ఇతర తృణధాన్యాలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మక్కజొన్న సాగు దాదాపు 7.50 లక్షల ఎకరాలు దాటేసింది. కొన్ని పంటలు పొట్ట దశలో ఉన్నాయి. పప్పుశనగ పంట చివరి దశకు వచ్చింది. వచ్చే నెల నుంచి పంటలు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావడం మొదలవుతుంది. అయితే, పంటల నమోదు ప్రక్రియ ఆలస్యం కావడంతో మద్దతు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు మద్దతు ధర భరోసా ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

క్రాప్ బుకింగ్ ఎందుకంటే?

మద్దతు ధరకు పంట దిగుబడులు కొనుగోలు చేయడం కోసం పంటల నమోదు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రైతులు తమ పంటలను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లేదా స్థానిక రైతు వేదికల్లో, లేదా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు పంట పొలాల్లోకి వెళ్లి పంటల నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్ణీత ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం శాటిలైట్ మ్యాపింగ్, భూముల సాగు యోగ్యత తనిఖీలు, రైతు భరోసా పథకం కింద సాగు భూముల గుర్తింపు వంటి ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు. శాటిలైట్ మ్యాపింగ్​తో సర్వే నంబర్లు, బైనంబర్లు తదితర సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే వెంటనే పంటల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని, మద్దతు ధరల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ జాప్యంతో రైతులకు నష్టం జరగకుండా, వ్యవసాయ శాఖ త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లేకపోతే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్తున్నాయి.