ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన పోలీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన పోలీసులు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కుట్రను భగ్నం చేసేందుకు తాము స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనను రికార్డ్ చేసేందుకు మొయినాబాద్ ఫాం హౌజ్ లో 4 స్పై కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు అమర్చినట్లు కోర్టుకు తెలిపారు. మధ్యాహ్నం 3.5 గంటలకు  కెమెరాలను ఆన్ చేశామని,  3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారని పోలీసులు వెల్లడించారు. సాయంత్ర 4.10కి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని పేర్కొన్నారు. సుమారు మూడున్నర గంటలపాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారని, తమ ప్లాన్ ప్రకారం మీటింగ్ పూర్తవగానే కొబ్బరి నీళ్లు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము వెంటనే హాలులోకి ప్రవేశించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. 

నిందితుల డైరీలో 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరాలు

ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనకు సంబంధించి నిందితుల సెల్ ఫోన్ ల నుంచి కీలక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్స్, రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీన్ షాట్లను రిమాండ్ నివేదికలో పోలీసులు పొందుపరిచారు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ‘సంతోష్ బీజేపీ’ పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ ను కూడా పోలీసులు నివేదికలో పొందుపరిచారు. అలాగే నందు డైరీలో టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న నిందితుల సంభాషణ వాయిస్ రికార్డర్ లో నమోదైందని పోలీసులు తెలిపారు. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపినట్లు, తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లో రికార్డైందని పోలీసులు తెలిపారు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ప్రజా ప్రతినిధులనను కొనుగోలు చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డైందని పోలీసులు కోర్టుకు వివరించారు.