అలజడి రేపుతున్న అగ్ని ప్రమాదాలు

అలజడి రేపుతున్న అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ప్రాంతంలో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతోంది. గతేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందగా..  సికింద్రాబాద్​లోని రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న అగ్ని ప్రమాదం చోటుచేసుకొని 8 మంది చనిపోయారు. ఈ తర్వాత నాలుగు నెలల్లోనే తాజాగా నల్లగుట్టలో మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.  

కనీస చర్యలు తీసుకోకపోవడంతోనే..

గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తూ.. అన్ని వివరాలు సేకరించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హడావుడి చేస్తుంటారు. గోడౌన్లపై సర్వే చేసి రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. కనీసం అగ్ని ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్ లోనూ కనీస చర్యలు చేపట్టలేదు. రెసిడెన్షియల్ భవనాలను కమర్షియల్ పర్పస్​లో వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వస్తున్నా పట్టించుకోవడంలేదు. అన్నీ పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు వాటిపై అదనంగా ఫ్లోర్లు నిర్మిస్తూ వాటిని ఇష్టారీతిన వినియోగిస్తుండటంతో ఇవి కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. 

ప్రాపర్టీ ట్యాక్స్​లపైనే దృష్టి నిర్మాణాలు పూర్తయిన బిల్డింగ్​ను ఏ పర్పస్​లో వాడుతున్నారనే విషయాన్ని బల్దియా పట్టించుకోవడంలేదు. ప్రాపర్టీ ట్యాక్స్​క్లియర్​గా ఉందా? లేదా? అని మాత్రమే 
చూస్తున్నారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారుల లోపాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలని  కౌన్సిల్ సమావేశాల్లోనూ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అనుమతులు​ఇస్తున్నందుకే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదు.