డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతికే..!

డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతికే..!

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ‘కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న డబుల్​ బెడ్​రూం ఇండ్ల కోసం  69 వేల మంది లబ్ధిదారులను ఎమ్మెల్యేలతో  సమన్వయం చేసుకుంటూ ఎంపిక చేయండి’ అంటూ ఈ నెల 24న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ’ అన్న ఆయన మాటలను బట్టి చూస్తే  దళిత బంధులాగే డబుల్​ బెడ్​రూం ఇండ్లను కూడా ఎమ్మెల్యేలే ఫైనల్ ​చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు పలు జిల్లాల్లో  ఎమ్మెల్యేల అనుచరులు, టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, లీడర్లు రంగంలోకి దిగారు. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఇండ్లు ఇప్పించుకునేందుకు లిస్టులు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇండ్లు ఇప్పిస్తామంటూ రూ.50 వేల నుంచి లక్ష దాకా వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

45 రోజుల్లో లిస్టుల తయారీకి ఆదేశాలు

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను 2023 జనవరి 15 లోగా పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికపై చీఫ్‌‌‌‌ సెక్రెటరీ సోమేశ్​కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ తో కలిసి కలెక్టర్లతో ఈ నెల 24వ తేదీన ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.18,328 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. హైదరాబాద్‌‌‌‌ జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు 69 వేల మంది లబ్ధిదారులను.. ఎమ్మెల్యేలతో  సమన్వయం చేసుకుంటూ ఎంపిక చేసి, పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను ఇప్పటికే అందజేసినట్లు ప్రకటించారు. 

లాటరీ తీస్తారా.. ఎమ్మెల్యే ఇచ్చే లిస్టులే ఫైనలా?

గతంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. డబుల్ బెడ్ రూం ఇండ్లకు మించి అప్లికేషన్లు వస్తే ముందుగా ఫీల్డ్​సర్వే చేసి అర్హులను గుర్తించాలి. తర్వాత గ్రామ, వార్డు సభల్లో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. మిగిలిన అర్హుల వివరాలతో వెయిటింగ్ లిస్టు తయారు చేసి ఉంచాలనే ఆదేశాలున్నాయి. కానీ, తాజాగా మంత్రి ప్రశాంత్​రెడ్డి చెప్పినదాన్ని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఇచ్చే లిస్టులే ఫైనల్‌‌‌‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే దళితబంధు స్కీం లాగే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు, లీడర్లకే డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు దక్కుతాయని ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందుతున్నారు.

డబ్బుల వసూళ్లు

ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌‌‌‌ బెడ్​రూం ఇండ్ల కోసం చాలా చోట్ల లబ్ధిదారుల నుంచి ఇప్పటికే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు, ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేశారు. ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి లక్షకు పైగా తీసుకొని మొఖం చాటేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వందల కోట్లు అక్రమంగా వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పుడు సర్కారు ఇండ్ల పంపిణీకి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వడంతో డబ్బులిచ్చిన వాళ్లంతా లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. లిస్టులో కచ్చితంగా తమ పేరుండేలా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్ధిదారుల లిస్ట్ ​తయారు చేసి గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇప్పుడు సర్కారు ఆదేశాలతో పాత జాబితాల ప్రకారం పంపిణీ చేస్తారా? లేక కొత్తగా లిస్ట్​లు తయారు చేస్తారా? అనే విషయాన్ని కలెక్టర్లు గోప్యంగా ఉంచుతున్నారు. కానీ ఫీల్డ్​లెవెల్​కు వెళ్లి డబుల్‌‌‌‌ ఇండ్ల నిర్మాణాల పరిస్థితిపై  ఎప్పటికప్పుడు సర్కారుకు నివేదికలు  పంపిస్తున్నారు.   

బిల్లులు రాక ఆగిన ఇండ్లు

డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇంజినీరింగ్‌‌‌‌ శాఖలను ఇన్‌‌‌‌వాల్వ్‌‌‌‌ చేసి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18,328 వేల కోట్లతో 2.91 లక్షల ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్‌‌‌‌ చేసి ఇప్పటివరకు రూ.11,990 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా, 6 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌‌‌‌ ఉండడంతో వేలాది డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని చోట్ల పునాదుల్లో, మరికొన్ని చోట్ల పిల్లర్ల వరకు, ఇంకా కొన్ని చోట్ల  స్లాబ్‌‌‌‌ వేసి గోడలు కట్టకుండా ఉన్న ఇండ్లు వేలల్లో కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీల్లో 18 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని సర్కారు చెబుతున్నప్పటికీ,  క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వీటిలో చాలా వరకు రిపేర్లే కన్పిస్తున్నాయి. తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్‌‌‌‌ వస్తువులను దొంగలు ఎత్తుకుపోవడం వల్ల లబ్ధిదారులు నివాసం ఉండడానికి అనువుగా లేకుండా పోయాయి. సర్కారు సగం మాత్రమే బిల్లులివ్వడంతో కాంట్రాక్టర్లు తమ బిల్లులు ఇచ్చే వరకు డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీకి అంగీకరించమని తెగేసి చెబుతుండడం గమనార్హం.