ముందు పాలసీ.. ఆ తర్వాతే సిలబస్ మార్పు! : విద్యాశాఖ

ముందు పాలసీ.. ఆ తర్వాతే సిలబస్ మార్పు! : విద్యాశాఖ
  •     వచ్చే విద్యా సంవత్సరం కొత్త సిలబస్ రావడం కష్టమే 
  •     స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ ఖరారయ్యాకే మార్పులకు సర్కారు మొగ్గు 
  •     ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ నాలుగు విడతల్లో అమలు

హైదరాబాద్, వెలుగు: దశాబ్ద కాలంగా మారని స్కూల్ పాఠాలను మార్చేందుకు విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలను మార్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ’ ఖరారైన తర్వాతే కొత్త సిలబస్ తో పుస్తకాలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 

ఈ పాలసీ రూపకల్పనకు ఇంకా కొంత టైమ్ పడుతుండటంతో వచ్చే విద్యా సంవత్సరం (2026–-27) నాటికి కొత్త సిలబస్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మార్పులను ఒకేసారి కాకుండా నాలుగు విడతల్లో అమలు చేసేలా విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రంలో సిలబస్ మార్పు జరిగి సుదీర్ఘ కాలమైంది. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2011 –-12 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు దశలవారీగా సిలబస్‌‌‌‌‌‌‌‌ను మార్చారు. 

తొలి ఏడాది ఫస్ట్ క్లాస్ నుంచి మూడో తరగతి వరకూ, ఆ తర్వాత వరుస సంవత్సరాల్లో 3, 6, 7 క్లాసులు, 4, 5, 8, 9 తరగతులు.. చివరి ఏడాది పదో తరగతి సిలబస్ మార్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం తెలుగు సబ్జెక్టు సిలబస్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే మార్చారు. అప్పటి నుంచి పాత సిలబస్ పాఠాలే ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులు దశాబ్ద కాలం క్రితం నాటి పుస్తకాలనే చదువుకుంటున్నారు. 

ఈసారీ పాత సిలబస్​తోనే.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ విద్యార్థులకు సిలబస్ మార్పుపై దృష్టి పెట్టింది. తాజాగా పూర్తిస్థాయిలో సిలబస్ మార్చేందుకు అనుమతి కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. నాలుగేండ్లలో దశల వారీగా ఒకటి నుంచి పదో తరగతి వరకూ సిలబస్ మార్చనున్నట్టు ప్రపోజల్స్ లో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సిలబస్ మార్పు అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అందువల్ల 2026–27 విద్యా సంవత్సరంలో పాత సిలబస్ తోనే పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.

ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాకే..  

రాష్ట్రంలో కొత్త విద్యా విధానంపై  ప్రస్తుతం విద్యా నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపదిద్దుతోంది. అయితే, ఈ పాలసీ ఖరారు కావడానికి ఇంకొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. పాలసీ రాకముందే సిలబస్ మార్పు చేపడితే భవిష్యత్తులో సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ముందు పాలసీని ఫైనల్ చేసి, ఆ వెంటనే ఎన్​సీఈఆర్టీ సిలబస్ ప్రాతిపదికన కొత్త పుస్తకాలను రూపొందించాలని యోచిస్తున్నారు.